నల్లబెల్లిలో ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ
నల్లబెల్లిలో ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ
కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: డా. బోడ అనిల్ నాయక్
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్ సమీపంలో శనివారం తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.
పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డా. బోడ అనిల్ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. బోడ అనిల్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో పార్టీని గ్రామగ్రామాన బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జెండా పండుగ సందర్భంగా పార్టీ ప్రకటించిన పంచజన్యం తరహా ఐదు వినూత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లబెల్లి మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసి కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్న పలువురు యువ నాయకులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు టీఆర్ఎస్ విధానాలు, క్రమశిక్షణ, కల్వకుంట్ల కవిత నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ముందుకు రావడం హర్షణీయమని ఆయన అన్నారు. వారికి పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం ఉన్న బలమైన యువ నాయకులు, మహిళలు ముందుకు రావాలని, వారికి రాజకీయంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వంశీ, వాసు, బన్నీ, తన్వేష్, జశ్వంత్, సురేష్, అభిషేక్, సరోజనమ్మ, లక్ష్మి, ఐలయ్య, మంగ్య, భరత్, చందు, అరుణ్, మధు తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన యువకులు, మహిళలు, రైతులకు డా. బోడ అనిల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
