ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు

ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు

  • ఆదివాసుల గుండెల్లో మానని గాయం

అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ఇంద్రవెల్లి ఘటనకు ఈ ఏడాది 46 ఏళ్లు పూర్తవుతున్నాయి. అమరవీరుల సంస్మరణ దినాన్ని గత రెండేళ్లుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అమరవీరుల స్థూపం వద్ద రూ.95 లక్షల వ్యయంతో స్మృతి వనాన్ని నిర్మించారు. 1981 ఏప్రిల్ 20న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో “జల్, జంగిల్, జమీన్” (నీళ్లు, అడవి, భూమి) నినాదంతో శాంతియుత సమావేశం నిర్వహించారు.

ఆ రోజు వారాంతపు సంత కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు. సమావేశానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపుతప్పడంతో అప్పటి ఆర్డీవో అంబరీష్ సెక్షన్ 144 విధించి, కాల్పులకు అనుమతి ఇవ్వగా, పోలీసుల కాల్పుల్లో అధికారిక లెక్కల ప్రకారం 15 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఘటన ఆదివాసుల గుండెల్లో జలియన్‌వాలాబాగ్ తరహా మానని గాయంగా మిగిలిపోయింది. అనేక సంవత్సరాల పాటు ఏప్రిల్ 20న నివాళులర్పణకు నిషేధం ఉండగా, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా సంస్మరణ కార్యక్రమాలకు అనుమతి లభించింది.

ఆదివాసులు పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తూ, పంటలకు సరైన ధరలు లేకపోవడం, తూకం మోసాలు, వడ్డీ వ్యాపారుల దోపిడీ, అటవీ అధికారుల ఒత్తిళ్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యల నేపథ్యంలో జరిగిన ఆందోళన కాల్పులకు దారి తీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అమరుల కుటుంబాలకు రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అదనంగా స్మృతి వనం అభివృద్ధి పనులు చేపట్టారు.

అయితే ఇప్పటికీ ఆదివాసుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని నాయకులు అంటున్నారు. టైగర్ జోన్ పేరిట అడవుల నుంచి తరలింపులు జరుగుతున్నాయని, భూ హక్కుల పత్రాలు అందని వారు ఇంకా ఉన్నారని పేర్కొన్నారు. వేసవికాలంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.

రగల్ జెండా ఆశయ సాధన కమిటీ వ్యవస్థాపకులు ఆత్రం భుజంగ్ రావు మాట్లాడుతూ, అమరుల ఆశయాలు ఇంకా నెరవేరలేదన్నారు. పీసా, 1/70 చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాటి గూడకు చెందిన సెడ్మకి లచ్చుబాయి మాట్లాడుతూ.. తన భర్త కాల్పుల్లో అమరుడయ్యాడని, ఇటీవల ట్రైకార్ ద్వారా ట్రాక్టర్ ఇచ్చినా దానికి అవసరమైన విడిభాగాలు ఇవ్వలేదని, వాటిని తామే కొనాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.