32years | సమష్టి కృషితోనే.. డీజీపీ స్థాయికి

32years | సమష్టి కృషితోనే.. డీజీపీ స్థాయికి
32years | పదవీ విరమణ సత్కార సభలో శివధర్ రెడ్డి భావోద్వేగం
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సత్ఫలితాలు
పోలీస్ శక్తి అంటే గౌరవంగా జీవించడమే..
వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పోలీస్ బాస్ కృతజ్ఞతలు
32years | హైదరాబాద్, ఆంధ్రప్రభ : సమష్టి కృషి వల్లే తాను డీజీపీ స్థాయికి చేరి మంచి ఫలితాలు అందించగలిగానని పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి అన్నారు. 32 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో సేవ చేసిన ఆయనకు పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్‌లో గౌరవ వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీ సి.వి. ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్టా, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు.
అనేక సవాళ్లు, ఆనందాలు, అనుభవాలు
32 ఏళ్ల పోలీస్ సేవా జీవితంలో అనేక సవాళ్లు, ఆనందాలు, అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రయాణం చేశానని శివధర్ రెడ్డి తన వీడ్కోలు ప్రసంగంలో తెలిపారు. “నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని అన్నారు. 1970-80లలో ఉన్న పోలీసింగ్ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో చాలా మార్పులు వచ్చాయని, ఇప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

యువ పోలీస్ .. శాఖకు పేరు తేవాలి
తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై “తెలంగాణ భావాన్ని అణచివేశారు” అనే అపవాదు ఉందని, ఆ దూరాన్ని తగ్గించి ప్రజలు-పోలీసుల మధ్య సాన్నిహిత్యం పెంపొందించడానికి సిటిజన్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈ విధానాన్ని నడిపించామని, భవిష్యత్తుకు సిద్ధమైన (ఫ్యూచర్ రెడీ) పోలీస్ శాఖను తయారు చేశామని తెలిపారు. తన స్వరాష్ట్రానికి డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకి ధన్యవాదాలు చెప్పారు. తన గురువులు, సీనియర్లు, సహచరులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. “సమష్టి కృషి వల్లే ఈ స్థాయికి రాగలిగాను” అని అన్నారు. యువ పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చేలా పని చేయాలని సూచించారు. పోలీస్ శక్తి అంటే గౌరవంగా జీవించడమేనని గుర్తు చేశారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సి.వి. ఆనంద్ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ గా శివధర్ రెడ్డి
ఇది ఇలా ఉంటే స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించిన సర్కారు కీలక పదవి కట్టబెట్టింది. శివధర్ రెడ్డి శాంతిభద్రతలు, రోడ్ సేఫ్టీ, నార్కోటిక్స్ ఇతర అంశాలను పర్యవేక్షిస్తారని జీవోలో పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీ హోదా కల్పించడంతోపాటు నెలకు రెండు లక్షల 25వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని అందులో పొందుపరిచారు. మూడేళ్ల పదవీకాలం ఉంటుందని ఆయనకు ఓ ఎస్ డి, పర్సనల్ సెక్రెటరీ, ప్రైవేట్ సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్ల తో పాటు నలుగురు సిబ్బందిని కేటాయించారు.
CLICK HERE TO READ 450kperkg | ఎర్రటి వర్ణంతో కనువిందు చేస్తున్న ఇప్ప చెట్లు
