450kperkg | ఎర్రటి వర్ణంతో కనువిందు చేస్తున్న ఇప్ప చెట్లు
450kperkg | ఎర్రటి వర్ణంతో కనువిందు చేస్తున్న ఇప్ప చెట్లు
450kperkg | ఇప్ప చెట్ల అందాలు – పర్యాటకులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు
అడవి బిడ్డలకు ఇప్పపువ్వుతో జీవనోపాధి
మోదీ ప్రశంసలతో పెరిగిన డిమాండ్
సహజ సన్‌స్క్రీన్‌గా ఇప్ప ఆకుల ప్రత్యేకత
ఇప్ప వృక్షాల ఔషధ, ఆర్థిక ప్రాముఖ్యత
450kperkg | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రధాని మోదీ మెచ్చిన పోషక విలువలు కలిగిన ఇప్పపువ్వు లడ్డు, పిండి వంటకాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆకు రాలే కాలంలో వసంతాన్ని కోల్పోయి ఎడారిని తలపిస్తున్న బోసిపోయిన అడవుల్లో ఇప్ప పువ్వు కాసే ఇప్పవృక్షాలు ఎరుపు వర్ణ శోభితంతో పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
ఏప్రిల్ చివరి వారంతో పాటు మే నెలలో ఇప్ప చెట్లు ఆకు రాలకుండా సహజ సిద్ధంగానే ఎరుపు వర్ణాన్ని సంతరించుకోవడం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆదిలాబాద్, కవ్వాల్, ఉట్నూర్, కడెం ప్రధాన రహదారుల అటవీ ప్రాంతంలో ఎరుపు రంగు ఆకులను సంతరించుకున్న ఇప్ప కల్పవృక్షాలు ప్రకృతి ప్రేమికుల మనసును కట్టిపడేస్తున్నాయి. అడవుల్లో అన్ని చెట్లు ఆకురాలి నీడ లేక బోసిపోతుంటే.. ఇప్ప చెట్లు నీడనిచ్చి సామాన్యులకు సేద తీరుస్తున్నాయి.

వేసవిలో అడవి బిడ్డలకు జీవనోపాధి..
వ్యవసాయ పనులు లేక, ఉపాధి పనులు కరువైన గ్రామీణ పల్లె ప్రజలకు, ఆదివాసి అడవి బిడ్డలకు ఇప్పపువ్వు జీవనోపాధి కలిగిస్తోంది. సూర్యుడు ఉదయించక ముందే వేకువ జామున ఇప్ప చెట్ల కింద రాలిన పువ్వును సేకరించి గిరిజన కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాలకు వీటిని విక్రయించి నాలుగు పైసలు పోగు చేసుకుంటారు. దండిగా పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇప్పపువ్వు లడ్డు గురించి ప్రధాని మోదీ ఇటీవల తెగ మెచ్చుకోవడం తో ఇప్పపువ్వు వంటకాలు, తిరు బండారాలు, స్వీట్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడుతోంది. ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలో రూ. 450 కే కిలో ఇప్పపువ్వు లడ్డు విక్రయిస్తూ అడవి బిడ్డలు స్వయం ఉపాధి పొందుతున్నారు.
సహజ సన్ స్క్రీన్ గా లేత పత్రాలకు రక్షణ కవచం
ఎరుపు రంగులో కనిపిస్తున్న కల్పవృక్షంగా పేరొందిన ఇప్ప చెట్లు అడవులకే వన్నె తెచ్చి కనువిందు చేస్తున్నాయి. లేత ఆకులను సూర్య ప్రతాపం నుండి రక్షించుకోవడానికి, పశువులు ఇతర జంతువుల బారిన పడకుండా ఉండడం కోసం ఇప్ప చెట్లు ఎరుపు రంగును సంతరించుకుంటాయి. వేసవిలో ఆకులు రాల్చిన తర్వాత చిగురించిన లేత పత్రాలు రెండు నుండి మూడు వారాల పాటు ఎరుపు రంగును సంతరించుకుంటాయి.
అంతోసయనిన్ అనే వర్ణదం అరుణ వర్ణానికి కారణం. ఈ వర్ణదం సహజ సన్ స్క్రీన్‌గా చెట్లకు రంగు మారి రక్షణ కల్పిస్తుంది. ఇప్పపూలతో స్వీట్లు కాకుండా సాంప్రదాయ సారాయి తయారీలో, కాస్మెటిక్స్‌లో ఉపయోగిస్తారు. ఇప్ప గింజల నుండి ఔషధాల కోసం నూనెను కూడా తీస్తారు. సహజ సిద్ధ ఎరుపు వర్ణ శోభిత ఇప్ప చెట్లను అక్కడే ఈ చిత్రాలు తీయడం జరిగింది. కవాల్ టైగర్ రిజర్వ్ జన్నారం అడవుల్లో కల్పవృక్షాలుగా పేరుగాంచిన ఇప్ప చెట్లు ప్రకృతి సహజ సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయనడం లో అతిశయోక్తి లేదు.
- జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్
