ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 301 అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 301 అర్జీలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 301 అర్జీలు అందాయి. వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీదారుల కోసం కలెక్టరేట్‌లో కుర్చీలు ఏర్పాటు చేశారు. తాగునీరు సౌకర్యం, మెడికల్ క్యాంప్, సౌకర్యాలు కల్పించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్‌మాండ్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
