గ్రామాలే వికసిత్ భారత్‌కు పునాది

  • వీబీజీ రామ్‌జీతో గ్రామీణాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఏపీ
  • ఆంధ్రప్రదేశ్‌కు రూ.12,845 కోట్ల నిధులు
  • ఉపాధిని 125 రోజులకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయం
  • రైతులు, శ్రామికుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
  • 24వ స్థానం నుంచి గ్రామీణ పాలనలో దేశంలోనే తొలి స్థానానికి ఆంధ్రప్రదేశ్
  • పల్లె పండుగతో వేల కిలోమీటర్ల రోడ్లు, లక్షలాది ఆస్తుల సృష్టి
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో గ్రామాల అభివృద్ధే అత్యంత కీలకమని, గ్రామాలు బలోపేతం అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లెలో వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ యోజన–మిషన్ గ్రామీణ్) జాతీయ ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్త ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయడం రాష్ట్ర ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు ఐదు దశాబ్దాల ప్రజాజీవితాన్ని రైతులు, గ్రామీణ భారత అభివృద్ధికే అంకితం చేసిన నాయకుడిగా ఆయనను కొనియాడారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా గ్రామీణాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన మార్గదర్శకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు గ్రామీణాభివృద్ధి కోసం రూ.12,845 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కల పెంపకం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

హిందీలో మాట్లాడటానికి కారణాన్ని వివరిస్తూ, భారతదేశంలో భాషలు వేర్వేరు అయినా భారతీయత ఒక్కటేనని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ సమైక్యతకు భాషలు వారధులుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే మూడో అత్యధిక కేటాయింపు లభించడం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక చొరవ వల్లేనని చెప్పారు. వికసిత్ భారత్ జీ రామ్‌జీ జాతీయ ప్రారంభోత్సవానికి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లెను ఎంపిక చేయడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని అన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో ఒకేసారి 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి ఈ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశామని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణ ఉపాధి, గ్రామాల ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణం లక్ష్యంగా వీబీజీ రామ్‌జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదని, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే మహత్తర మిషన్ అని అభివర్ణించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచడం అత్యంత చారిత్రాత్మక నిర్ణయమన్నారు. అదనంగా 25 రోజుల ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత లభిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు కూలీల కొరత ఏర్పడకుండా పంటల సాగు సమయంలో 60 రోజుల విరామం కల్పించడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.7,707 కోట్లను కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి మొత్తం రూ.12,845 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ఇది మూడో అత్యధిక కేటాయింపు అని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం రూ.16,695 కోట్లతో 7 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1.07 లక్షల నీటి గుంటలు, ‘అడవితల్లి పిలుస్తోంది’ కార్యక్రమం కింద 1,373 కిలోమీటర్ల కచ్చా రహదారులు, 1.66 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటల అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. అదేవిధంగా 55.40 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించామని చెప్పారు. స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను మరింత విస్తరించి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. 2026-27 సంవత్సరంలో రైతులు పండించిన ఉద్యానవన పంటలను వేగంగా మార్కెట్లకు తరలించేలా 10 వేల కిలోమీటర్ల డంకర్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే మరో లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగు అభివృద్ధితో పాటు 1,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌లో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రస్తుతం దేశంలోనే తొలి స్థానానికి చేరుకుందని తెలిపారు. 2024-25లో ఐదు జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచామని, రాష్ట్రంలో అమలు చేస్తున్న మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం గర్వకారణమన్నారు. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడం మాత్రమే కాదని, ఆ పనులు చేసే వారి జీవితాల్లో భద్రత కల్పించడమూ ప్రభుత్వ బాధ్యతేనని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే ‘కూలీ’ అనే పదానికి బదులుగా ‘శ్రామికుడు’ అనే గౌరవప్రదమైన పదాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

ప్రమాదవశాత్తు మరణించిన శ్రామికుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.50 వేల నుంచి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలతో కలిపి రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెంచినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసం ఉంచి దేశంలోనే మూడో అతిపెద్ద నిధుల కేటాయింపును చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వీబీజీ రామ్‌జీ పథకాన్ని దేశానికే ఆదర్శంగా అమలు చేసి వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తామని హామీ ఇచ్చారు.