చెన్నూరు పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి
చెన్నూరు పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి
- మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత
మంచిర్యాల, ఆంధ్రప్రభ:
మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెన్నూరు మండలం ఎల్లక్కపేట గ్రామానికి చెందిన చల్ల శారద (24) అనే గృహిణి సోమవారం హత్యకు గురైంది. ఆమె భర్త రమేశ్ సుత్తితో దాడి చేసి హత్య చేశాడనే అనుమానంతో, పోలీసులు రమేష్‌తో పాటు సారయ్య అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
పోలీసులు నిందితులను విచారిస్తున్న సమయంలో, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రమేషే తమ కుమార్తెను దారుణంగా హత్య చేశాడంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన బాధితులు స్టేషన్‌పైకి ఒక్కసారిగా రాళ్లు రువ్వారు.
ఈ రాళ్ల దాడి కారణంగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్టేషన్ లోపల విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై మజీద్, హెడ్ కానిస్టేబుల్ సంపత్‌లకు ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది గాయపడిన ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


