Tirumala | కార్లు కాలుతున్నాయ్.. జాగ్రత్తలు తీసుకోండి.. ఎస్పీ

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుమలలో ఇటీవల రెండు కార్లు దగ్ధమైన ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో టీటీడీ ముఖ్య నిఘా, భద్రతాధికారి అయిన తిరుపతి జిల్లా ఎస్ పి హర్షవర్ధన రాజు ఈరోజు పలు సూచనలతో హెచ్చరికలు చేశారు. వేసవి తీవ్రత కారణంగా తిరుమల పరిధిలో రెండు కార్లు దగ్ధమైన నేపథ్యంలో కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే పలు కారణాలు తెలియజేశారని పేర్కొన్నారు. ఆ నిపుణుల సూచనల మేరకు ఆయన హెచ్చరికలతో చేసిన బహిరంగ విజ్ఞప్తిలోని అంశాలు ఇలా ఉన్నాయి.

వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చే కారు ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది. తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుంది. తిరుమల ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం. కనుక డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది ఆర్ పి ఎం ఎక్కువై వేడి పెరుగుతుంది. అలాగే దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది. ఎక్కువ బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం కూడా ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుందన్నారు.

పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్ చేయని వాహనాలలో:
కూలంట్ లీక్‌లు, తక్కువ స్థాయి కూలంట్, పాడైన రేడియేటర్లు, ఫ్యాన్లు, ఇంజిన్ ఆయిల్ లోపాలు వంటివి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయి. దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు, వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి. కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల కూడా ఫ్యాన్ పని చేయక, వేడి బయటకు వెళ్లక ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చునని నిపుణులు చెబుతున్నారు. కనుక యాత్రకు బయలుదేరు ముందు బండిని సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, AC ఆయిల్, రేడియేటర్ లీకేజీ తనిఖి, ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం, బ్యాటరీ లో డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తుప్పు కడిగించుకోవడం చేయాలి. అలాగే డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడవడం, బాగా మంచినీరు తీసుకోవడం, టీ, అల్పాహారం సేవించడం చేయాలి. వాహన డాష్ బోర్డు మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనిఖి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఘాట్ ఎక్కే ముందు కనీసం 30నిమిషాలు వాహనానికి విశ్రాంతి ఇవ్వండి. కొండ ఎక్కే సమయంలో ఏసీ ఆఫ్ చేయాలని, కొండ దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడాలని సూచిస్తున్నారు.

Leave a Reply