3.37Crores | తిరుమల కొండపై భక్తుల కిటకిట
3.37Crores | తిరుమల కొండపై భక్తుల కిటకిట
3.37Crores | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. వేసవి రద్దీ మొదలయింది. గత నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి. వెంకన్న స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. పరీక్ష ఫలితాలు రావడంతో పాటు శుభకార్యాలు జరుగుతుండటంతో తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది.
సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 16 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 4 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. టోకెన్ తీసుకున్న సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజులోనే 91 వేల 005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయంలో 36 వేల 257 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.37 కోట్లుగా నమోదైంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి సేవకులు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదం, మంచినీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు పాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ నెల మొత్తం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
