పేదల గడపల్లో ‘ఇందిరమ్మ’ ఆనందం

టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

  • ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం
  • ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం

సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతంగా ముందుకు సాగుతోందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీ 29వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, గృహాన్ని పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం తమకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేదలు శాశ్వత నివాసాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని అర్హులైన పేద కుటుంబాలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందాలని ఆమె సూచించారు. ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, కౌన్సిలర్ సంగీతా మహేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.