3rdMaysplstory | ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
3rdMaysplstory | ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
3rdMaysplstory | ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం.. ప్రజాస్వామ్యానికి శక్తివంతమైన గుర్తింపు
సమాచార హక్కు, నిజం కోసం పోరాటం.. మీడియా ముఖ్య బాధ్యత
మీడియా స్వేచ్ఛ లేకపోతే అజ్ఞానం, భయం, దుర్వినియోగం పెరుగుదల
జర్నలిస్టులపై దాడులు, హత్యలు.. భయానక వాస్తవం
కార్పొరేట్ ప్రభావం, ఫేక్ న్యూస్.. మీడియా విశ్వసనీయతకు ప్రమాదం
రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు.. జర్నలిస్టులపై పెరుగుతున్న సవాళ్లు
3rdMaysplstory | ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం కేవలం ఒక ఆచరణాత్మక వేడుక కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన ఒక గంభీరమైన గుర్తింపుదినం. సమాచార హక్కు, నిజం తెలుసుకునే హక్కు, అధికారాన్ని ప్రశ్నించే హక్కు—ఈ మూడు అంశాలు కలిపి పత్రికా స్వేచ్ఛను నిర్మిస్తాయి. ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే. 1991లో ఆఫ్రికాలోని విండోక్ నగరంలో జర్నలిస్టులు స్వేచ్ఛాయుత మీడియా కోసం పిలుపునిచ్చిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. దాని ఆధారంగా ఐక్యరాజ్యసమితి 1993లో మే 3ను ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా ప్రకటించింది.
అప్పటి నుంచి ప్రతిసంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ మీడియా స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యతను ప్రపంచానికి గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యంలో మీడియా “నాలుగో స్థంభం”గా పరిగణించబడుతుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియా కూడా సమాజాన్ని సమతుల్యంగా ఉంచే కీలక శక్తిగా ఉంటుంది. ప్రజలకు సరైన సమాచారం అందించడం, ప్రభుత్వ విధానాలను విశ్లేషించడం, అవినీతిని వెలికితీయడం, బలహీన వర్గాల స్వరంగా నిలవడం—ఇవి మీడియా ప్రధాన బాధ్యతలు. స్వేచ్ఛాయుత మీడియా ఉన్న దేశంలో ప్రజలు సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు.
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మీడియా స్వేచ్ఛ లేకపోతే అజ్ఞానం, భయం, దుర్వినియోగం పెరుగుతాయని గుర్తించాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో జర్నలిస్టులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వారిపై దాడులు, బెదిరింపులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. కర్ణాటకలో గౌరీ లంకేశ్ హత్యకు గురయ్యారు. మహారాష్ట్రలో శశికాంత్ వారిషే అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో హత్యకు గురయ్యారు. ముఖేష్ చంద్రకర్ జనవరి 2025లో రూ.120 కోట్ల రోడ్డు ప్రాజెక్టు కుంభకోణంపై దర్యాప్తు జరిపి కాంట్రాక్టర్ అరెస్టుకు దారితీసిన తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఒక సెప్టిక్ ట్యాంక్‌లో హత్యకు గురయ్యారు.

రాజీవ్ ప్రతాప్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 2025 సెప్టెంబర్‌లో అనుమానాస్పద రీతిలో నదిలో శవంగా తేలాడు. ఏప్రిల్ 2026లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉదయపు వాకింగ్ సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టును వెంబడించి కత్తితో పొడిచి చంపారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలు మీడియాపై ప్రభావం చూపడం వల్ల వార్తల స్వతంత్రత దెబ్బతింటోంది. సోషల్ మీడియా విస్తరణతో సమాచారం వేగంగా చేరుతున్నా, అదే సమయంలో ఫేక్ న్యూస్, మిస్ ఇన్ఫర్మేషన్ కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో నిజమైన జర్నలిజం మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) మాటల స్వేచ్ఛను హామీ ఇస్తుంది. దీనిలో భాగంగా పత్రికా స్వేచ్ఛ కూడా ఉంది.
అయితే ప్రస్తుత కాలంలో మీడియాపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ మరియు గ్రామీణ జర్నలిస్టులు మరింత ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో మీడియా స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ భారతదేశంలో అనేక ధైర్యవంతమైన జర్నలిస్టులు నిజం కోసం పోరాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతున్నారు. స్వేచ్ఛ ఉన్న చోట బాధ్యత కూడా ఉండాలి. జర్నలిస్టులు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నైతిక ప్రమాణాలు ఉన్నాయి. వాటిలో నిజాన్ని నిర్ధారించి మాత్రమే ప్రచారం చేయాలి, వాస్తవాలను వక్రీకరించకూడదు, సమాజంలో విభేదాలు రేకెత్తించే వార్తలను జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజల ప్రయోజనాన్ని ముందు ఉంచాలి.
సెన్సేషన్ కోసం వార్తలను వక్రీకరించడం మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా అభివృద్ధితో మీడియా రంగం విపరీతంగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక రిపోర్టర్‌లా మారే పరిస్థితి ఏర్పడింది. ఇది ఒకవైపు అవకాశమైతే మరోవైపు ప్రమాదం కూడా. ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టడం ఒక పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు, బాధ్యతాయుతమైన డిజిటల్ జర్నలిజం మరింత అవసరం అయింది. ప్రజలు నిజమైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయకూడదు. స్వతంత్ర మీడియాను ప్రోత్సహించాలి. జర్నలిస్టుల భద్రతకు మద్దతు ఇవ్వాలి. మీడియా స్వేచ్ఛ బలంగా ఉన్న దేశంలోనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ఆళవందార్ వేణుమాధవ్
8686051752
