ఓటు హక్కుతో పాటు బాధ్యత కూడా: సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : ఓటు ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా అని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైతే సరిచేసుకోవాలని ఆయన సూచించారు. ఇంట్లో లేకపోయినా ఆన్‌లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు, ఇతర వివరాలు సక్రమంగా నమోదై ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని ఆయన తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని గూడెల్లి శ్రీకాంత్ పిలుపునిచ్చారు.