నాణ్య‌మైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

మణుగూరులో ఎంఎస్‌ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు (ఆంధ్రప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిని సందర్శించి వైద్యులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఇటువంటి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి యాజమాన్యం అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, జిల్లా నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.