హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : భారత హజ్ కమిటీ ఆధ్వర్యంలో 2027 సంవత్సరానికి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు హజ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్ లేదా ‘హజ్ సువిధా’ మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 22 నుంచి జూలై 20, 2026 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుందని, గడువు పొడిగింపునకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
జూలై చివరి వారంలో ‘ఖుర్రా’ (డిజిటల్ యాదృచ్ఛిక ఎంపిక) విధానం ద్వారా యాత్రికులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా ఎంపికైన ప్రతి యాత్రికుడు ఆగస్టు 10, 2026లోపు రూ.1,52,300 అడ్వాన్స్ మొత్తాన్ని తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దరఖాస్తుదారులు మార్గదర్శకాలను పూర్తిగా చదివి, కనీసం 31 డిసెంబర్ 2027 వరకు చెల్లుబాటు అయ్యే మెషిన్ రీడబుల్ భారతీయ పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ ముందు-వెనుక పేజీల స్కాన్ కాపీలు, తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ పాస్‌బుక్ లేదా రద్దు చేసిన చెక్ లీఫ్, చిరునామా ధ్రువీకరణ పత్రాల స్కాన్ కాపీలను మాత్రమే అప్‌లోడ్ చేయాలని సూచించారు.
హజ్ సీటు కేటాయించిన తర్వాత రద్దు చేసుకుంటే నిర్వహణాపరమైన ఇబ్బందులు తలెత్తడంతో పాటు, కొత్త మార్గదర్శకాల ప్రకారం భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని యాకూబ్ పాషా హెచ్చరించారు. కాబట్టి యాత్రికులు తమ సన్నద్ధతను, ప్రయాణంపై ఉన్న నిబద్ధతను పరిశీలించుకుని మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 8520860785 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
