28వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి రామగిరి శ్రీనివాస్ ప్రచార జోరు..
28వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి రామగిరి శ్రీనివాస్ ప్రచార జోరు..
‘ఆపిల్’ గుర్తుతో గెలుపే లక్ష్యంగా ముందడుగు!
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలోని 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామగిరి శ్రీనివాస్ తన ప్రచారంతో వార్డును హోరెత్తిస్తున్నారు. ఆదివారం వార్డులోని ప్రధాన వీధులు, బస్తీలలో తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా పర్యటించిన ఆయన, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. తన ఎన్నికల గుర్తు అయిన ‘ఆపిల్’ గుర్తుకు ఓటు వేసి, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 28వ వార్డును అభివృద్ధి చేయడం, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ఏకైక ధ్యేయమని స్పష్టం చేశారు. కౌన్సిలర్ గా గెలిచాక వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు. శ్రీనివాస్ గెలుపు కోసం ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ రామగిరి లావణ్య స్వయంగా రంగంలోకి దిగి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవంతో ఆమె వార్డులోని మహిళలతో మమేకమవుతూ శ్రీనివాస్‌కు మద్దతు కూడగడుతున్నారు. శ్రీనివాస్ విజయం కోసం మహిళల నుండి విశేష స్పందన లభిస్తోందని, వార్డు అభివృద్ధి కోసం ఆపిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వార్డులోని ముఖ్య నాయకులు, యువకులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లీడర్లు పాల్గొని శ్రీనివాస్ విజయం కోసం నినదించారు.
