చలివేంద్రం ధ్వంసం… నీటి కుండల్లో అపవిత్రం

చలివేంద్రం ధ్వంసం… నీటి కుండల్లో అపవిత్రం
మానవత్వాన్ని అవమానించిన దుండగులు
ఖమ్మం, ఆంధ్రప్రభ : పేదల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు అమానుష చర్యలకు పాల్పడిన ఘటన ఖమ్మం పట్టణంలోని 20వ డివిజన్లో కలకలం రేపింది. చలివేంద్రాన్ని ధ్వంసం చేయడంతో పాటు నీటి కుండల్లో అపవిత్ర చర్యలకు దిగడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ప్రజాసేవ కార్యక్రమాలపై జరిగిన ఈ దాడిని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో బ్లాక్ స్కార్పియో వాహనం అక్కడికి చేరినట్లు, ఇద్దరు వ్యక్తులు దిగినట్లు కనిపించింది. వారు చలివేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డును ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసి, ఆ ముక్కలను కారులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన వెనుక ప్రణాళికాబద్ధమైన కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా 20వ డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి మాట్లాడుతూ, ప్రజాసేవ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన వెనుక ఉన్న వారిపై పూర్తి వివరాలు తెలిసినా, విచారణపై నమ్మకం ఉంచుతూ ప్రస్తుతం పేర్లు వెల్లడించడం లేదని తెలిపారు. సంబంధిత వాహనం వివరాలు పోలీసులకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
నీటి కుండలను అపవిత్రం చేయడం వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందజేశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
