వాట్సాప్ స్టేటస్‌తో రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చ

వాట్సాప్ స్టేటస్‌తో రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చ

గుడి, గురుకులం సమీపంలో బార్‌పై అభ్యంతరం
తనతో బేరసారాలు చేస్తున్నారంటూ ఆరోపణ.
కల్తీ మద్యం అమ్ముతారంటూ ఘాటు వ్యాఖ్యలు.

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలో మరోసారి రాజకీయ చర్చకు దారితీసేలా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ సంచలనంగా మారింది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి , ఈసారి పట్టణంలో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయ్యప్ప స్వామి ఆలయం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న గురుకుల విద్యాసంస్థ సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన స్టేటస్‌లో పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఆ బార్‌ను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఆ బార్‌ను కొనసాగించేందుకు నిర్వాహకులు తనతో బేరసారాలకు దిగారని, వ్యాపారం కొనసాగించేందుకు నెలకు రూ.1.5 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని స్టేటస్‌లో ఆరోపించారు.

మరోవైపు అక్కడ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు చేసిన ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం, పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తిరువూరు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.