19aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
19aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఓ మనిషీ…నన్ను కాపాడు(కో)…! ముఖచిత్ర కథనం
19aprSunday2026 | నీ అలవాట్లు… నాకు(కాలేయానికి)శత్రువులు
లివర్‌పై ఆల్కహాల్ యుద్ధం
జంక్ ఫుడ్ వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం
కాలేయం ఇచ్చే హెచ్చరిక ఇదే
లివర్‌ను కాపాడే సింపుల్ జాగ్రత్తలు
ఆరోగ్యమైన జీవితం కోసం లివర్ కేర్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేను నీ శరీరంలో రెండో అతిపెద్ద అవయవాన్ని మాత్రమే కాదు.. నీ తిక్క పనులన్నీ, భరిస్తూ, నీ రక్తాన్ని శుద్ధి చేసే **’క్లీనింగ్ మిషన్’**ని. నువ్వు ఆనందంగా పీల్చే గాలిలో ఉండే రకరకాల కాలుష్యం, గుప్పుగుప్పున నీ లోపలికి (అంటే నా మీదికి) వదిలే సిగరెట్ పొగ, నువ్వు విలాసంగా తాగే మందు, ఇష్టంగా లాగించే మితిమీరిన మాంసాహారం, బయట దొరికే చెత్తాచెదారం… వరకు ప్రతిదాన్నీ నేనే భరించాలి.
కానీ, నా ఓపికకు కూడా ఒక హద్దు, నా శక్తికి పరిమితి ఉంటుంది సుమా! అది క్షీణించిన నాడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఏ మందులూ, డాక్టర్లూ, ఏ ట్రీట్‌మెంట్‌లూ నన్ను తిరిగి నీకివ్వలేవు. ఏ ఆరోగ్య బీమాలు కూడా ఖర్చును ఇచ్చినా, నన్ను మాత్రం ఇవ్వలేవు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే… ఈరోజు “ప్రపంచ కాలేయ దినోత్సవం”. ఈ సందర్భంగా అయినా నా ఆవేదనను విను. వింటే నీకే మంచిది… లేకుంటే నీ ఖర్మ!
నీ ‘పార్టీ’లు.. నా ‘కన్నీళ్లు’!
వారాంతం వచ్చిందంటే చాలు.. నువ్వు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బాటిల్స్ గలగలలు నీకు హుషారు ఇస్తుంటే.. నేను దడదడలాడుతాను. ‘చీర్స్’ అంటూ నువ్వు లోపలికి పంపే ఆల్కహాల్ నా పాలిట భయంకరమైన యాసిడ్ లాంటిది. నువ్వు ఎంజాయ్ చేస్తుంటే, నేను ఇక్కడ విషాన్ని విరిచే పనిలో కొట్టుమిట్టాడుతుంటాను. నువ్వు గ్లాసుల మీద గ్లాసులు లోపలికి పంపిస్తుంటే.. నేను గాయాలతో నిండిపోతుంటాను. గుర్తుంచుకో.. “నువ్వు తాగేది నన్ను బలోపేతం చేసే మందు కాదు, నన్ను అంతం చేసే మందు!“
నువ్వు లాగించే జంక్ ఫుడ్.. అదంటే నాకు ‘జంకే’!
మందు తాగని వాళ్ళు “మేమేం పాపం చేశాం” అనకండి! మీరంతా తినే నూనె బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, మంచూరియాలు, నూడుల్స్… ఇవన్నీ నా చుట్టూ కొవ్వు పేరుకుపోతున్నాయి (Fatty Liver). నన్ను మృదువైన అవయవంగా ఉండనివ్వకుండా.. గట్టిగా మార్చేస్తున్నారు. రుచి కోసం మీరు చేసే తప్పులకు.. నేను శిక్ష అనుభవిస్తున్నాను.

నా నుంచి నీకో ‘హెచ్చరిక’..
ఈ హెచ్చరిక నిన్ను భయపెట్టడానికి కాదు.. నిన్ను మేల్కొలపడానికి! ఇప్పటిదాకా చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడానికి. నా ప్రత్యేకత ఏంటో తెలుసా? నాలో 75% భాగం పాడైపోయినా సరే.. నేను పని చేస్తూనే ఉంటాను. కానీ ఒకసారి నేను అలిగి చేతులెత్తేశానా.. అంతే సంగతులు! ఇక నీ ప్రాణం గాలిలో దీపమే!
-మాధవ్
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

పరిపాలనలో లలనల ప్రాముఖ్యం
అనగనగా మణిద్వీపమనే రాజ్యాన్ని విక్రమసేనుడనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో మూడేళ్లుగా వర్షాలు లేవు. చెరువులు పగుళ్లిచ్చాయి, పశువుల దాహానికి నీరు లేదు. దేశమంతా అశాంతి నెలకొంది. రాజుగారు మంత్రిని పిలిచి, “మంత్రివర్యా! వారం రోజుల్లోగా వరుణ దేవుడు కరుణించే మార్గం చూడాలి. ప్రజల ఆకలి తీరాలి, లేదంటే మీ పదవి ఊడటమే కాదు, మీకు మరణశిక్ష తప్పదు!” అని గర్జించాడు.
మంత్రిగారు ఇంటికి వెళ్లి భోజనం కూడా చేయకుండా దిగులుగా కూర్చున్నారు. “వానలు కురిపించడం మనిషి చేతిలో పని కాదు కదా! ఇప్పుడు నా ప్రాణాలు పోవడం ఖాయం” అని వాపోయారు.
అప్పుడు ఆయన భార్య సుగుణవతి వచ్చి, “స్వామీ! మీరు చింతించకండి. నేను చెప్పినట్టు చేయండి” అని ఒక రహస్యం చెప్పింది.
మర్నాడు మంత్రిగారు రాజుగారి అనుమతితో ఊరంతా చాటింపు వేయించారు:
“ప్రజలారా! కరువు వల్ల ధాన్యం కొరత ఉంది. ఎవరైతే అడవిలో ఎండిపోయిన కొమ్మలను తెచ్చి, వీధుల చివర బహిరంగ ప్రదేశాల్లో పొయ్యిలు పెట్టి వంట చేస్తారో.. వారికి మాత్రమే రాజకోట నుండి ఉచితంగా ధాన్యం ఇవ్వబడుతుంది!”
ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. “ఇదేం వింత? ఇంట్లో వంట చేసుకోనివ్వకుండా వీధుల్లో చేయమంటారేంటి?” అనుకున్నారు. కానీ ఆకలి ముందు ఆశ్చర్యం ఆగలేదు. జనం గుంపులు గుంపులుగా అడవికి వెళ్లి, ఎండు కొమ్మలను తెచ్చి, ఊరి కూడళ్లలో పెద్ద పెద్ద పొయ్యిలు రాజేసి వంటలు చేయడం మొదలుపెట్టారు.
వేల సంఖ్యలో వెలిగిన ఆ పొయ్యిల నుండి దట్టమైన పొగ ఆకాశంలోకి లేచింది.
అద్భుతం జరిగింది! మూడు రోజులు గడిచేసరికి ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్మాయి. నాలుగో రోజున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండిన భూమి తడిసింది, చెరువులు నిండాయి. ప్రజల ఆనందానికి అంతులేదు.
రాజుగారు మంత్రిగారిని అభినందించి తన ధర్మసందేహన్ని బైటపెట్టారు ”వంటల కారణంగా వర్షాలు కురువటం విచిత్రంగా ఉంది. ఈ అద్భుతం ఎలా సాధ్యమయింది? “.
“ మహారాజా! మన నగరం చుట్టూ గల అడవుల్లో ఉన్నవి మంచి గంధపుచెట్లు, దేవదారు వృక్షాలు. వాటి ఎండు కొమ్మలనే వంటచెరకుగా ఉపయోగించింది. శాస్త్రీయంగా చెప్పాలంటే.. గంధపు చెక్కలు, దేవదారు వంటి వృక్షాల పొగలో ఉండే కొన్ని అణువులు (Nuclei) ఆకాశంలోని మేఘాలను ఆకర్షించి, అవి వర్షించేలా ప్రేరేపిస్తాయి. ఆరుబయలు అందరూ కలసి రెండు రోజులుగా వంటలు చేయటం వల్లే మూడో రోజు నుంచి ముసురు పట్టి పుష్కలంగా వర్షాలు కురిసాయి” మంత్రిగారు అసలు విషయం బైటపెట్టారు.
“మంత్రివర్యా! మరోసారి మీ ప్రతిభతో సమస్యను పరిష్కరించారు.” అని ప్రశంసించగా , పక్కనే ఉన్న మహారాణి నవ్వుతూ.. “మహారాజా! ఈ ఉపాయం వెనుక ఒక స్త్రీ ఉంది. పురుషులు యుద్ధాలు, లెక్కల గురించి ఆలోచిస్తారేగాని .. స్త్రీలు వంటింటి పొయ్యిని కూడా ప్రజా సంక్షేమానికి అనువుగా తీర్చిదిద్దగలరు ” అంది.
మంత్రిగారు తన భార్య చేసిన మేలును వివరించగా, రాజుగారు ఆశ్చర్యపోయి, “కేవలం ఇంటిని కాపాడటమే కాదు, సంక్షోభాలనుంచి రక్షించడంలో కూడా మహిళల ఆలోచనలు ఎంతో అవసరమని మేం గుర్తించాం” అని ప్రకటించారు.
ఆ రోజే తన పాలనలో మూడో వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తూ శాసనం చేశారు మణిద్వీపం మహారాజుగారు.
స్త్రీల సహజమైన ఆలోచనా ధోరణి, సమయస్ఫూర్తి క్లిష్టమైన సమస్యలకు కూడా ఎంతో సులభమైన, శాశ్వతమైన పరిష్కారాలను చూపిస్తాయి. అందుకే ప్రజాపాలన సవ్యంగా సాగాలంటే స్త్రీలకు సైతం శాసనాధికారంలో ఎంతో కొంత భాగం పంచాలి.
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

జనరేషన్ గేప్
అప్పట్లో…మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాట జవదాటే వారు కారు. అన్నిటికీ ఒద్దికగా ఉంటూ బుద్ధిమంతుల్లా ఉండేవారు. అప్పటి పిల్లలే పెద్దలు అయి ఇప్పుడు తల్లిదండ్రులుగా మారారు. కానీ వచ్చిన సమస్య ఏమిటి అంటే తమ పిల్లలు అప్పటి తమలా ఒద్దికగా ఉండటం లేదు అని , పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు అని , చదువు పట్ల శ్రద్ధ చూపడం లేదు అని బాధపడటం.
ఆ రోజుల్లో చదవడం అంటే పుస్తకం ముందు పెట్టుకుని గంటలు గంటలు కూర్చోవడం.కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఏ మొబైల్ లోనో సాఫ్టు కాపీ ను ఓపెన్ చేసి చదువుకుంటున్నారు పిల్లలు. లేదా లాప్టాప్ లో వీడియో లెక్చర్స్ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ ఇవి చూసి పెద్దలు ఇప్పటి పిల్లలు చదవడం లేదు అని ఫోన్ చూస్తూ కాలం గడువుతున్నారు అని బాధపడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు.
కాలం వేగంగా మారుతోంది.దానితో పాటూ పద్ధతులు కూడా మారుతున్నాయి. అప్పట్లో మేము అలా ఉన్నాము కాబట్టి మా పిల్లలు కూడా అలాగే ఉండాలి అనుకోవడం తప్పు. ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు వాళ్ళ ఆలోచనా విధానం ఉంటుంది అని , వాళ్ళ జీవన పద్ధతులు ఉంటాయి అని అర్థం చేసుకుంటే వారిపట్ల మన టెన్షన్ తగ్గుతుంది.
ఇప్పటి పరిస్థితి కి పోటీకి తగ్గట్టు పిల్లలే ఈ ప్రపంచాన్ని ఈదుతారు . ఒక ఒడ్డుకి చేరుకుంటారు. కేవలం మనం తల్లిదండ్రులుగా ఏది మంచి ఏది చెడు అని చెప్పడం వరకే మన బాధ్యత. మిగతా విషయాలు వాళ్ళకే వదిలేయాలి. ఎక్కువగా మన చాదస్తంతో వాళ్ళను సతాయిస్తే మొదటికే మోసం వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్ !!!
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

భౌతిక అవసరాల లోకం, (ఆది భౌతిక దృష్టి)
యుద్ధాల కాలం! దూరంగా సప్త సముద్రాల అవతల ఎవడో ఒక నిర్ణయం తీసుకుంటాడు! దాని వల్ల కరీంనగర్ లో మెట్ పల్లి, పక్కన, లేదా ఆదిలాబాద్ నిర్మల్ పక్కన పల్లెటూళ్ళో ఉన్న సామాన్యుడు జీవితం, నెల బడ్జెట్ మారిపోతోంది! ఖర్చులు పెరుగుతాయి లేదా తగ్గుతాయి! గ్యాస్ సిలిండర్ దొరకదు! సాధారణ జీవితం దెబ్బతింటుంది! నేను యుద్ధంలో లేను, నాకు ఏం సంబంధం? అయినా దాని ప్రభావం లోకం అంతా కనిపిస్తుంది! అంటే నేను కూడా యుద్ధంలో పరోక్షంగా ఉన్నట్టే!
ఏమిటి ఈ విచిత్రం? కరోనా లాక్ డౌన్ చూశాం! చావు భయం అందరికీ తెలిసింది! భవిష్యత్తులో జీవాయుదాల యుద్ధం అంటున్నారు!
ఇంత టెక్నాలజీ, ఇన్ని సుఖాలు ఉన్నాయి! కాలక్షేపానికి మన ఫోనే కనికట్టు చేసి జో కొడుతోంది! మంచి చెడ్డ రెండూ నా ఫోన్లో ఉన్నాయి! హంసలా జనం మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది! లేదా విషమే తీసుకుంటాను అంటే కలియుగం కాలనాగు అయ్యి కరిచి చంపి వేస్తుంది! సాంకేతికత సుఖం ఇస్తోంది! అది సుఖమా, నరకమా అనేది వేరే చర్చ! కానీ ప్రతీ క్షణం, ప్రతీ అడుగులో ప్రమాదం మనల్ని పొంచి ఉంది! ఈ రాత్రి పడుకుంటాం. రేపు ఉదయం, మబ్బులో కళ్ళు తెరుచుకుంటాయి అన్న గ్యారంటీ లేదు!
ఇది వైరస్సుల యుగం! కొత్త రోగాలు అని వైద్య శాస్త్రం చెబుతోంది!
ఎప్పుడు ఏ వైరస్ వల్ల ఏ రోగం వస్తుందో, లేదా కుటుంబంలో ఎవరికన్నా ఆక్సిడెంట్, రోడ్డు ప్రమాదం జరిగితే….ఇన్సూరెన్స్ ఉంటే సరే, లేదంటే మొత్తం బ్రతుకు రోడ్డు మీద పడిపోతుంది!
ఆది భౌతిక దృష్టి, ఆది ఆధ్యాత్మిక దృష్టి, ఆది దైవిక దృష్టి అని మూడు రకాలుగా మన సనాతన ధర్మం చెబుతుంది! ఆది తాత్విక దృష్టి అని ఇంకో కోణం ఉంది!
ఈ వారం ఆది భౌతిక దృష్టి గురించి మాట్లాడుకుందాం! అబ్రహం మాష్లో అనే పశ్చిమ దేశీయుడు మన జ్ఞానాన్నే కాపీ కొట్టి మనిషి నిజంగా సుఖంగా ఉండాలంటే ఏడు ముఖ్య సూత్రాలు ప్రతిపాదించాడు! మన అష్టాంగ యోగ, పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో అవి కనీసం ఒక్క శాతం కాదు!
కానీ ఈరోజు ప్రపంచం, అబ్రహం మాష్లో హైరార్కే ఆఫ్ హ్యూమన్ నీడ్స్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు!
అందులో మొదటిది Physiological needs! మనిషికి కావాల్సిన మన భాషలో, కూడు, గూడు, గుడ్డ ఉండాలి! అవి కనీస అవసరాలు! మన ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత బియ్యం అందులో భాగమే! ఇంకా కొన్ని Freebies(ఉచితాలు) ఎన్నికల వేళ ఒక జూదం ఆట అయ్యింది! పార్టీలు ఒకరిని మించి ఒకరు వాస్తవ పరిధులు దాటి వాగ్దానాలు చేస్తున్నారు! దానికి తోడు వందల కోట్ల ఎన్నికల ఖర్చు! ఈ మాయ నెగ్గాక ఏం చేస్తున్నారు? ఎన్ని చెయ్యగలుగుతున్నారు అది వేరే చర్చ!
భౌతిక అవసరాల లోకంలో, మోసం, అబద్దం, అవినీతి ఇవి కూడా నిత్యావసర వస్తువులుగా చెలామణీ అయిపోతే ఎంత కష్టం?! స్వార్థం పరిథి లెక్కకు అందకపోతే! పొలాలు, స్థలాలు, farmhouse లు కారప్పూస పొట్లాలుగా కట్టి దాచేస్తున్నారు! పేదవాడికి అందాల్సిన భూమి ప్రహరీ గోడ పొట్లాల వెనుక దాచి పెడితే, పేదలకు సరైన ఇళ్లు (దీనికి Practical పరిష్కారం వేరే ఉంది, అందరికీ Accomodation దీనికి Community Living, ప్రతీ మనిషికి గాలీ, వెలుతురు, కాంతి వచ్చేలా, ప్రైవసీ ఉండేలా Attached washrooms తో సహా ఇవ్వడం… అది వేరే చర్చ)
లేకపోతే విప్లవం మహా ప్రళయమై భీభత్సం, అంతర్యుద్ధం సృష్టి చేసి సరి చేస్తుంది! ఎవరు ఆపగలరు! ఆది భౌతిక దృష్టి అసలు అర్థం వేరే ఉంది! మనం ప్రస్తుతం, కేవలం భౌతిక అవసరాల దృష్టిలో చూద్దాం ఇప్పుడు, అందులో శృంగారం, మైథునం కూడా భాగం! కూడు, గూడు, గుడ్డ, మైథునం మనుషులకు అవసరం! నిజం మాట్లాడాలంటే మనకు సిగ్గు! పైన నాలుగు అంశాలు ధర్మ మార్గంలో అందకపోతే, అందాల్సిన వయసులో అందక పోతే…, సమాజం తన సహత్వాన్ని కోల్పోయి, అసహజత్వంలో బ్రతుకుతుంది! కుళ్ళి పోతుంది కూలిపోతుంది, డొల్లలా, పేకమేడలా! కళ్ళ ముందు అంతా బాగున్నట్టు కనిపిస్తూ, తెర వెనుక రహస్యంగా అన్ని బాగోతాలు జరుగుతాయి!!
ప్రకృతి అసత్వాన్ని, అసహజత్వాన్ని భరించలేదు! కపటత్వం, hypocrisy లో మనలో చాలామంది బ్రతుకుతున్నాము!
లోకాన్ని సహజత్వం వైపు నడిపించడం మన బాధ్యత! ఆట, మాట, పాట, తిండి…అన్నీ ప్రకృతి మాత ఒడిలో సేద తీరి సహజత్వం వైపు నడవాలి! నటన కుదరదు! నీలో మనిషిని నువ్వు మోసం చేసుకుంటే అంతా విషాదం! పైకి నవ్వుతాము! కానీ మన లోపల డొల్ల ఉంటే, మానసిక శాంతి దొరకదు! మంచి పాటలు పాడితే సరిపోదు, జీవితంలో ఆ మంచి ఆచరించాలి! లేదంటే నేడు ఒక సింగర్ గురించి వింటున్నాం, అదే జరుగుతుంది!
సత్యం వైపు నడిచే ప్రయత్నాలు చేద్దాం! భౌతిక అవసరాల లోకంలో భూమి సహజత్వాన్ని కాపాడుకుందాం! సత్యమేవ జయతే!
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

బుధవారం ప్రత్యేకం సహస్ర కలశాభిషేకం
నిత్యకల్యాణ చక్రవర్తి అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య,వార, పక్ష, మాస, వార్షికోత్సవాలెన్నో జరుగుతుంటాయి. అందులో తిరుమలేశుని గర్భాలయం ముందు నిర్వహించే ప్రతి బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం మరో విశిష్ట సేవగా పేరొందింది. క్రీ శ 614 లో పేరిందేవి గా ప్రసిద్ధిచెందిన పల్లవ రాణి సామవై 18 అంగుళాల ఎత్తైన శ్రీనివాసుని వెండి విగ్రహాన్నీ తిరుమల ఆలయానికి సమర్పించింది. భోగ శ్రీనివాసుడుగా పిలిచే ఆ విగ్రహానికే సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ప్రతి బుధవారం నిత్య ప్రాత కాల సేవలన్నీ పూర్తి అయిన తరువాత 6 గంటలకు పైన ఈ సేవని నిర్వహిస్తారు.
ఈ సేవ లో భాగంగా అర్చకులు భోగ శ్రీనివాసమూర్తి ని బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపం లో తూర్పు ముఖంగా ఒక వేదికపై ఉంచుతారు ఆ వేదికకు ఇరువైపులా ఎదురెదురుగా ఉండే వేదికలపై శ్రీదేవి భూదేవి సమేతులైన మలయప్పస్వామి ని ఒక వైపు, శ్రీవారి సేనాధిపతి అయినా విష్వక్సేనుడి ని మరో వైపు ఉంచుతారు. భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భాలయంలోని తిరుమలేశుని మూలమూర్తితో కలిపే విధంగా సంధాన తోరణం అనే పట్టు దారాన్ని కడ్తారు.
ఆపై సుగంధ ద్రవ్య జలాలు నింపిన 1008 వెండి కలశాలపై మామిడి ఆకులు, పట్టు వస్త్రాలతో కప్పి ఉంచి ప్రత్యేక మంత్రోచ్ఛరణలతో పవిత్రం చేస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి కి వైఖానస ఆగమోక్తంగా పంచ సూక్త, పంచ శాంతి మంత్రాలతో పంచామృతాలతో, సుగంధజలాలతో, అభిషేకాన్ని నిర్వహిస్తారు.
మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర ధారా పాత్ర (చిల్లులు ఉన్న వెండి పళ్లెం) ద్వారా నిర్వహించే అభిషేకం కన్నుల పండుగలా ఉంటుంది. చివరగా బంగారు కలశంలో నింపిన పవిత్ర జలాలను అర్చకులు విమాన శిఖర మార్గంలో ప్రదక్షిణగా గర్భాలయంలో నికి తీసుకువెళ్లి మూలమూర్తి పాదాలపై చల్లడంతో సహస్ర కలశాభిషేకం ముగుస్తుంది.
15వ శతాబ్దం నుంచి నివహిస్తున్న ఈ సహస్ర కలశాభిషేక సేవ ను 2006 నుంచి ఆర్జిత సేవ గా నివహిస్తున్నారు. ఈ అభిషేక సేవలో పరిమిత సంఖ్యలో అనుమతించే భక్తుల శిరస్సులపై అభిషేక జలాలను అర్చకులు చల్లుతారు.
ఓం నమో వేంకటేశాయ

