17thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
17thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
17thAprilCartoon | దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్
మహిళా బిల్లులోని మెలికపై వివాదం
ఉత్తరాది ప్రాబల్యం – దక్షిణాది ఆవేదన
సమాఖ్య వ్యవస్థపై ప్రభావం ఏమిటి?

17thAprilCartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకటే చర్చ.. అది ‘డీలిమిటేషన్‘. కానీ విశ్లేషకులు మాత్రం దీనిని నియోజకవర్గాల పునర్విభజన అనడం కంటే, ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య సాగనున్న ‘ఢీ-లిమిటేషన్‘ అనడమే కరెక్ట్ అని అభివర్ణిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక చారిత్రక విజయంగా ప్రదర్శిస్తోంది. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం అంటే అది అద్భుతమైన పరిణామమే. కానీ, ఈ ‘కానుక‘ను అందించే క్రమంలో ప్రభుత్వం పెట్టిన మెలిక ఇప్పుడు పెను వివాదానికి దారి తీస్తోంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ‘డీలిమిటేషన్‘ జరగాలన్న షరతు, ఒక అందమైన గిఫ్ట్ బాక్స్‌కు వేసిన గట్టి తాళంలా కనిపిస్తోంది. ఆ తాళం తీస్తే కానీ లోపల ఉన్న ఫలాలు అందవు.. కానీ ఆ తాళం తీసే క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలిపీఠం ఎక్కబోతోందా? అన్నదే అసలు ప్రశ్న.
ఉత్తరాది ప్రాబల్యం – దక్షిణాది ఆవేదన:
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య రెట్టింపు అవుతుంది. అదే సమయంలో, దశాబ్దాలుగా జనాభా నియంత్రణను పాటిస్తూ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య నామమాత్రంగా పెరుగుతుంది. ఫలితంగా పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాలదే పైచేయి అవుతుంది. ఢిల్లీ పీఠం ఎవరిదనేది కేవలం రెండు మూడు ఉత్తరాది రాష్ట్రాలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది.
జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి బహుమతి ఇవ్వాల్సింది పోయి, వారి రాజకీయ బలాన్ని తగ్గించడం ఎంత వరకు న్యాయం? అందుకే విశ్లేషకులు దీనిని రాష్ట్రాల మధ్య ‘ఢీ‘ కొట్టే ప్రక్రియగా చూస్తున్నారు. కేంద్రం ఎన్ని వివరణలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో అంకెలు మాత్రం దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే నిజాన్ని నొక్కి చెబుతున్నాయి.
మహిళా బిల్లు అనే ఆకర్షణీయమైన కానుకను చేతిలో పట్టి, దాని వెనుక డీలిమిటేషన్ అనే తాళంను వేయడం ద్వారా ప్రభుత్వం ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని చూస్తోందా? రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా, అది దేశ సమాఖ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు కాకూడదు. పాలకుల ఆశయం గొప్పదై ఉండొచ్చు, కానీ అది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తే ‘ప్రజాస్వామ్యం‘ తన అసలు అర్థాన్ని కోల్పోతుంది.
రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్-ఔరా.
