ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
- ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాలు
- 99.24% హాజరు నమోదు
విజయవాడ, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థులు భారీగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉదయం నుంచే హాజరై పరీక్షలు రాశారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పరీక్షలు ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా సాగాయి. జిల్లాలో ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్ పరీక్షల కోసం మొత్తం 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 27,249 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు కేటాయించగా, అందులో 27,043 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 206 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దీంతో హాజరు శాతం 99.24 శాతంగా నమోదైంది.
ఓపెన్ స్కూల్ పరీక్షలు…
అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షల కోసం జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 671 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు కేటాయించగా, అందులో 546 మంది పరీక్షలకు హాజరయ్యారు. 125 మంది గైర్హాజరయ్యారు.
దీంతో హాజరు శాతం 81.37 శాతంగా నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక స్క్వాడ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పర్యవేక్షణ చేపట్టాయి. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
