10th,12th Grades | జైలు గోడల మధ్య.. విద్యాదీపం

10th,12th Grades | జైలు గోడల మధ్య.. విద్యాదీపం

పట్టభద్రులైన ఖైదీలే టీచ‌ర్లు
టెన్త్​లో వందశాతం
ఇంట‌ర్‌లో 95% ఉత్తీర్ణ‌త‌
దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ గాజియాబాద్ జిల్లా జైలు

10th,12th Grades | న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లా జైలు ఇప్పుడు చదువుల కేంద్రంగా నిలుస్తోంది. జైలంటే కేవలం శిక్ష అనుకునే పరిస్థితుల్లో కూడా విద్యతో కొత్త జీవితాన్ని అందిస్తోంది. జైలు గోడల మధ్య విద్యా దీపం వెలిగిస్తూ ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతోంది. అందుకు ఉదాహరణనే 10, 12 వతరగతి పరీక్ష ఫలితాలు. ఖైదీలు జైల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి నిర్వహించిన 10వ, 12వ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. హైస్కూల్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఇంటర్మీడియట్‌లో 95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2025-26 విద్యా సంవత్సరంలో హైస్కూల్ పరీక్షలకు మొత్తం ఐదుగురు ఖైదీలు హాజరయ్యారు. వీరిలో ఒకరు ఫస్ట్, నలుగురు సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో హైస్కూల్‌లో 100 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 18 మంది ఖైదీలు హాజరుకాగా, అందులో 17 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 11 మంది సెకండ్ క్లాస్, 6 మంది థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఒకరు మాత్రమే ఫెయిల్ అయ్యారు. మొత్తం మీద 95 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

10th,12th Grades | జైలు అధికారి కీలక ప్రాత

ఈ విజయానికి జైలు అధికారి సీతారామ్ శర్మ కీలక ప్రాత పోషించారు. ఖైదీలను చదువుపై ప్రోత్సహించేందుకు జైలు యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జైలు ప్రాంగణంలో లైబ్రరీ ఏర్పాటు చేసి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఖైదీలు అక్కడే కూర్చొని చదవడమే కాకుండా, పుస్తకాలను తీసుకుని తమ సెల్లో కూడా అభ్యసించే అవకాశం కల్పించారు. బోర్డు పరీక్షలకు ముందు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఖైదీలకు సన్నద్ధత కల్పించారు.

10th,12th Grades | ‘ఇతర ఖైదీలకు ప్రేరణగా’

ఈ పరీక్ష ఫలితాలు ఇతర ఖైదీలకు కూడా ప్రేరణగా నిలుస్తాయని జైలు అధికారి సీతరామ్ శర్మ పేర్కొన్నారు. ఖైదీలు కేవలం పరీక్షలు పాస్ కావడం మాత్రమే కాకుండా, సమాజంలో తిరిగి స్థిరపడేలా తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యతో వారి ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తు గురించి కొత్తగా ఆలోచిండం ప్రారంభిస్తారని చెప్పారు. వీలైనంత ఎక్కువమందికి విద్యను అందించేలా జైలు యంత్రాంగం పుస్తకాలు, తరగతులతో సహా సాధ్యమైన అన్ని విధాలా మద్దతును అందిస్తుందని వెల్లడించారు.

తోటి ఖైదీలకు పాాఠాలు

గాజియాబాద్ జైలు యంత్రాంగం చదువును మధ్యలో ఆపేసిన ఖైదీలను గుర్తిస్తుంది. వారిని చదువును కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. అలా వారితో పదో తరగతి, ఇంటర్ను పూర్తి చేపిస్తుంది. అలా ఇంటర్ పూర్తి చేసిన వారికి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) నుంచి డిగ్రీ పట్టా పొందేలా చేస్తోంది. జైల్లోనే పరీక్షా కేంద్రం కూడా ఉంది. అంతేకాకుండా అదనంగా ఉత్తర్ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా గాజియాబాద్‌ జిల్లా జైలులో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పట్టభద్రులైన ఖైదీలు తోటి వారికి పాఠాలు బోధిస్తారు. అంతేకాకుండా, జైలు అధికారులు వివిధ సామాజిక సంస్థలతో కలిసి వివిధ కోర్సులపై విద్యా సెషన్లను నిర్వహిస్తారు.

ఇతర నైపుణ్యాల్లో శిక్షణ

గాజియాబాద్ జిల్లాలో విద్యతో పాటు ఖైదీలకు వివిధ నైపుణ్యాలు కూడా నేర్పిస్తున్నారు. జైలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి సర్టిఫైట్ కంప్యూటర్ కోర్సులను అందిస్తున్నారు. అదేవిధంగా టైలరింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, హస్తకళలు, హెయిర్ కట్, మ్యూజిక్, డ్యాన్స్, పూల కుండల తయారీ, నర్సరీ, బ్యూటీషియన్ వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఉత్తర్ప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి మిషన్ కింద ఒక శిక్షణా కేంద్రం జైలు ప్రాంగణంలో ఉంది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ నైపుణ్యాలతో స్వయం ఉపాధి సాధించి సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలన్నదే జైలు యాజమాన్యం లక్ష్యంగా పనిచేస్తోంది.

CLICK HERE TO READ MORE : minimum10k | విమాన‌యానం..ప్రియం స్పీడ్ పెట్రోల్ ధరలు పెర‌గ‌డ‌మే కార‌ణం

CLICK HERE TO READ MORE :

Leave a Reply