Electric Cars Iబిలియన్​ పెట్టుబడలపై భారత్​ ఆశలు

Electric Cars I బిలియన్​ పెట్టుబడలపై భారత్​ ఆశలు

Electric Cars I ప్లాంట్​ ఏర్పాటుపై ఫలించని చర్చలు
దిగుమతి సుంకాలు, స్థానిక అమ్మకాల మ‌ధ్య కుద‌ర‌ని లింకు
ఆర్థికంగా లాభదాయకం కాదనే అంచనాలు
భారత్​లో ₹40 లక్షలు దాటి ఈవీల కొనుగోలు కష్టమే
వ్యూహాత్మకంగా వెనకడుగు వేసిన అమెరికా కంపెనీ

Electric Cars I సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

టెస్లా సంస్థ భారతదేశంలో గిగా ఫ్యాక్టరీ నిర్మించడం లేదని అధికారికంగా స్పష్టం చేసింది. కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారత్‌లోకి వస్తుందని, బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగినప్పటికీ, అంతిమంగా ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా యాజమాన్యం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ప్లాంట్ ఏర్పాటు కోసం భారత ప్రభుత్వంతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే టెస్లా ఈ వ్యూహాత్మక వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. టెస్లా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం దిగుమతి సుంకాలు, స్థానిక అమ్మకాలపై రెండు వర్గాల మధ్య కుదరని సయోధ్య. భారత ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు విదేశాల నుంచి వచ్చే కార్లపై భారీగా సుంకాలు విధిస్తోంది. అయితే, టెస్లా మొదట విదేశాల నుంచి తమ కార్లను తక్కువ పన్నులతో భారత్‌కు దిగుమతి చేసుకుని, ఇక్కడి మార్కెట్లో డిమాండ్‌ను పరీక్షించిన తర్వాతే ప్లాంట్ నిర్మిస్తామని పట్టుబట్టింది. దీనికి భారత ప్రభుత్వం నిరాకరిస్తూ.. ముందుగా ప్లాంట్ నిర్మించి, స్థానికంగా ఉత్పత్తి ప్రారంభిస్తేనే రాయితీలు ఇస్తామని స్పష్టం చేయడంతో డీల్ ముందుకు సాగలేదని మార్కెట్​ వర్గాల అంటున్నాయి.

ఆర్థికంగా లాభదాయకం కాదనే..

మరో ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రస్తుత అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా కొంత నెమ్మదించింది. చైనాకు చెందిన బీవైడీ వంటి చౌక ఈవీ కార్ల నుంచి టెస్లా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. దీంతో టెస్లా అంతర్గతంగా ఖర్చులను తగ్గించుకోవడం, ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది. కొత్తగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో భారీ పెట్టుబడితో సరికొత్త ప్లాంట్‌ను నిర్మించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా లాభదాయకం కాదని టెస్లా బోర్డు భావించినట్టు తెలుస్తోంది.

భారీ ఖర్చుతో కూడిన వాహనాలు..

భారత మార్కెట్లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , స్థానిక కొనుగోలు శక్తి కూడా టెస్లా ఆలోచనను మార్చాయి. భారత్​లో ఈవీ మార్కెట్ వేగంగా పెరుగుతున్నప్పటికీ, టాటా, మహీంద్రా వంటి స్వదేశీ కంపెనీలు ₹15 లక్షల నుంచి ₹25 లక్షల బడ్జెట్ పరిధిలో కార్లను అందిస్తున్నాయి. కానీ, టెస్లా కార్ల ధరలు పన్నులతో కలిపి ₹ 40 లక్షల పైమాటే ఉంటాయి. ఇంత భారీ ధరతో కూడిన లగ్జరీ ఈవీ మార్కెట్ భారత్‌లో ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించకపోవడం, పైగా టెస్లా తన గ్లోబల్ ప్రొడక్షన్ స్ట్రాటజీని మార్చుకోవడంతో.. ప్రస్తుతానికి భారత్‌లో ప్లాంట్ ఆలోచనకు ఆ సంస్థ స్వస్తి పలికినట్టు ఆటోమొబైల్​ రంగ నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply