డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ నిరసన..
- డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరపాలి: ఉషశ్రీ చరణ్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండల కేంద్రంలో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న పరిణామాలు లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమించిన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిన బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు.
డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, అభ్యంతరాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టి అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో నిర్లక్ష్యం, నిరుద్యోగ భృతిపై స్పష్టత లేకపోవడం, విద్యార్థుల సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆమె, ఈ వ్యవహారానికి రాజకీయ బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి, అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ నిరుద్యోగ యువతకు అండగా పోరాటాన్ని కొనసాగిస్తుందని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన విభాగం కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
