ఎమ్మార్పీఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి..

  • పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా పండుగను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో సాధించిన ఎస్సీ వర్గీకరణ ఫలితాలను మాదిగ, మాదిగ ఉప కులాలు అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు.

తరతరాలుగా విద్యా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో తీవ్ర వెనుకబాటు తనానికి గురైన మాదిగ ప్రజలు ఇకపై విజ్ఞానం, నైపుణ్యం, సృజనాత్మకతలను ఆయుధాలుగా చేసుకుని అన్ని రంగాల్లో ఎదగడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో మాదిగ జాతి అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో రాబోయే పోరాటాలలో నూతన యువతరం పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.