చేగువేరా జయంతి సందర్భంగా ఘన నివాళులు..
చేగువేరా జయంతి సందర్భంగా ఘన నివాళులు..
- స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రపంచ విప్లవయోధుడు ఎర్నెస్టో చేగువేరా జయంతి వేడుకలను పురస్కరించుకొని చౌటుప్పల్ పట్టణంలో జనసేన పార్టీ నాయకులు ఆముదాల పరమేష్ నేతృత్వంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పైలాన్ పార్క్, తంగేడు వనంలో ప్రజలకు, వ్యాపారులకు పరమేష్ చేతుల మీదుగా చెత్తబుట్టలను పంపిణీ చేశారు. చేగువేరా జీవిత విశేషాలు, ఆయన విప్లవ భావజాలం, సామాజిక సేవా స్పూర్తిని వివరించే పుస్తకాలను యువతకు, స్థానిక ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆముదాల పరమేష్ మాట్లాడుతూ “ప్రతి అడుగు స్వచ్ఛత వైపు.. ప్రతి గడప పరిశుభ్రత వైపు.. నవ నిర్మాణమే జనసేన లక్ష్యం – చౌటుప్పల్‌ను స్వచ్ఛంగా మారుద్దాం” అన్నారు. దేశం, జాతి, మతం అనే సరిహద్దులను దాటి మానవత్వం కోసం పోరాడిన మహనీయుడు చేగువేరా అని కొనియాడారు. ప్రపంచ యువతలో సామాజిక చైతన్యం, పోరాట స్ఫూర్తి, సేవాభావాన్ని నింపిన గొప్ప విప్లవ యోధుడని పేర్కొన్నారు. ‘ప్రజల కోసం జీవించడం, అవసరమైతే ప్రజల కోసమే ప్రాణత్యాగం చేయడం’ అనే సందేశాన్ని తన జీవితం ద్వారా నిరూపించిన మహోన్నత వ్యక్తి ఆయన అన్నారు.
సమాజం కోసం, దేశం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ప్రతి జనసైనికుడు చేగువేరాను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చేగువేరా సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ప్రతి యువకుడిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొల్లం మల్లేశ్, చిన్నం ప్రశాంత్, బద్రి రాజు, చిన్నం రాజీవ్, పెద్దగొని లింగస్వామి, సరికొండ సంజయ్, పాశం శ్రీనాథ్, శ్రీకాంత్, ముద్ధం రాజు, గణేష్, దొడ్డి వంశీ, బాలగోని శివ, పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.
