యోగంతో ఆరోగ్యం.. యోగాంధ్రతో ఆరోగ్య చైతన్యం

యోగంతో ఆరోగ్యం.. యోగాంధ్రతో ఆరోగ్య చైతన్యం

శారీరక, మానసిక వికాసానికి యోగా అత్యవసరం: జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు, ఆంధ్రప్రభ : యోగం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం కర్నూలు నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక యోగ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించేందుకు యోగా ఉత్తమ సాధనమని తెలిపారు. యోగా సాధన ద్వారా శరీరానికి ఉత్సాహం, మనసుకు ప్రశాంతత లభిస్తాయని, ఏకాగ్రత పెరిగి జీవన నాణ్యత మెరుగుపడుతుందని చెప్పారు.

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యోగాకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ, ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు యోగా సాధన ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.

రోజుకు కనీసం పది నిమిషాల పాటు ప్రాణాయామం చేసినా ఆరోగ్యపరంగా విశేష ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.

ప్రతి గ్రామంలో యోగాంధ్రకు విస్తృత ప్రచారం

యోగాంధ్ర కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సంఘాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

ప్రజలందరూ యోగాంధ్రలో నమోదు చేసుకుని జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ మెగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం

యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. యోగా సాధనను ప్రతి ఇంటికి చేర్చడం ద్వారా జీవనశైలి వ్యాధులను తగ్గించి ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా లెప్రసీ అధికారి డా. భాస్కర్ రాజు, డీఈఓ సుధాకర్, మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఎస్‌డీఓ భూపతిరావు, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డా. అమర్నాథ్, ఆయుష్ మెడికల్ అధికారి చంద్రిక, సీనియర్ వైద్యులు డా. కేవీఎన్ ప్రసాద్, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్, జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి మునిస్వామి, నేషనల్ యోగా జడ్జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.