మహిళల ఓటుతో ప్రతిపక్షాలకు గుణపాఠం

మహిళల ఓటుతో ప్రతిపక్షాలకు గుణపాఠం
- నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఓడించామని సంబరాలు చేసుకున్న డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు మహిళలే ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పారని పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
బుధవారం నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు ఆవరణలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని ఆరోపించారు.
మహిళా బిల్లు ఓడించామని పార్లమెంట్‌లోనే సంబరాలు చేసుకున్న ఆ పార్టీలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు ఓటు ద్వారా సమాధానం ఇచ్చారని తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదం పొందించి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
