Telangana Rains Alert | తెలంగాణలో భారీ వర్షాలు
Telangana Rains Alert | తెలంగాణలో భారీ వర్షాలు
Telangana Rains Alert | పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
తదుపరి రెండు గంటలు కీలకం.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు
హైదరాబాద్ పశ్చిమ శివార్లలోనూ వర్ష సూచనలు
Telangana Rains Alert | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ తక్షణ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాద్‌నగర్ ప్రాంతాలతో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, పోచంపల్లి, జనగాం, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలైన మొయినాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, కొల్లూరు, తెల్లాపూర్, నాగులపల్లి, నల్లగండ్ల, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్, కోకాపేట్, మణికొండ, హిమాయత్‌సాగర్ తదితర ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
