చంద్ర బాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చారు?..

చంద్ర బాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చారు?..

టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రతుల దహనం..
వైసీపీ పార్టీ నాయకులు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం నంద్యాల పట్టణంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని సాయిబాబా నగర్ వైఎస్సార్ సర్కిల్ వద్ద కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సద్దల సూర్యనారాయణ రెడ్డి, పీపీ మధుసూదన్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క కీలక హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధిక స్థాయిలో ఉండటంతో సామాన్య ప్రజలపై భారాలు పెరిగాయని విమర్శించారు.

వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, పేదల ఆరోగ్య భద్రత దెబ్బతిన్నదని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మినహా కూటమి ప్రభుత్వం చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలకు అదనంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, సంపద సృష్టించి సంక్షేమాన్ని మరింత విస్తరిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.

రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం, వైఎస్సార్ విగ్రహాలు, శిలాఫలకాల ధ్వంసం వంటి చర్యలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదని అన్నారు.

ప్రజలు కూటమి హామీలను నమ్మి అధికారాన్ని అప్పగించారని, అయితే రెండేళ్లు గడిచినా వాటి అమలుపై స్పష్టత కనిపించలేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల భారం వైపు నెట్టారని ఆరోపిస్తూ, తగిన సమయంలో ప్రజలే తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర వ్యవసాయ విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు విజయశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply