శ్రద్ధగా పాఠాలు వింటే విజయం మీదే
డీఐఈఓ బి. సులోచనారాణి
కోదాడ, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రమశిక్షణతో తరగతి గదిలో పాఠాలను శ్రద్ధగా వింటే విజయం తప్పకుండా సాధించగలరని సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) బి. సులోచనారాణి అన్నారు.
కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల రికార్డులను పరిశీలించి, అధ్యాపకుల బోధన విధానం, విద్యార్థుల క్రమశిక్షణ, సమయపాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, కళాశాలలో అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. మంచి మార్కులతో ఉన్నత విద్యను అభ్యసించి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి హాస్టల్‌లో ఉచిత వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు త్వరలో మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
