ప్రజల భద్రతకు ప్రాధాన్యం…
- ఆటోల్లో క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ భద్రతా వ్యవస్థ ప్రారంభం
- స్కాన్ చేస్తే డ్రైవర్ వివరాలు, లైవ్ లొకేషన్ సహా 8 భద్రతా సేవలు
- హిందూపురంలో 196 ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల
- పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆటో డ్రైవర్లకు డిజిటల్ గుర్తింపు కల్పించే లక్ష్యంతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆటోల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ భద్రతా వ్యవస్థను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ శనివారం హిందూపురంలోని ఎంజీఎం మైదానంలో లాంఛనంగా ప్రారంభించారు.
హిందూపురం పోలీసు శాఖ, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 196 మంది ఆటో డ్రైవర్లకు డిజిటల్ ఐడీ కార్డులు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఆటో డ్రైవర్ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటో తదితర సమాచారాన్ని భద్రత కలిగిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రత్యేక డిజిటల్ ఐడీతో కూడిన క్యూఆర్ కోడ్ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఆటోలో అమర్చిన క్యూఆర్ కోడ్‌ను ప్రయాణికులు స్కాన్ చేస్తే డ్రైవర్ వివరాలు, వాహన యజమాని సమాచారం, లైవ్ లొకేషన్ షేరింగ్, సమీప పోలీస్ స్టేషన్ వివరాలు, ఫిర్యాదు నమోదు, అత్యవసర కాల్, డ్రైవర్‌కు రేటింగ్ తదితరంగా ఎనిమిది భద్రతా సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ విధానం వల్ల ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి మరింత భద్రత, విశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే కదిరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం ధర్మవరంలో 550 నుంచి 600 ఆటోలకు క్యూఆర్ కోడ్ అమలు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వచ్చే నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల ఆటోలకు డిజిటల్ గుర్తింపు, క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమలు చేయడమే లక్ష్యమని వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆటో యూనియన్లు, డ్రైవర్లు పూర్తి సహకారం అందించాలని కోరిన ఎస్పీ, నిర్ణీత గడువులోగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయని వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత భద్రత కల్పించి శ్రీ సత్యసాయి జిల్లాను సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, రవాణా శాఖ అధికారి శ్రీనివాసులు, సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, జనార్దన్, కరీం, ఎస్సైలు, మున్సిపల్ అధికారులు, రవాణా శాఖ సిబ్బంది, 13 ఆటో యూనియన్ల ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
