Female Officers Problems | రవాణా శాఖలో మహిళా అధికారుల ఇబ్బందులు
Female Officers Problems | రవాణా శాఖలో మహిళా అధికారుల ఇబ్బందులు
Female Officers Problems | వాహనాలు లేక విధుల్లో ఎదురవుతున్న సమస్యలు
వినతులు చేసినా స్పందించని అధికారులు
అర్ధరాత్రి తనిఖీల్లో మహిళా అధికారుల భద్రత ప్రశ్నార్థకం
మంత్రి చొరవతో పరిష్కారం దొరుకుతుందా?
Female Officers Problems | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను పట్టుకోవాలి… అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.. ప్రభుత్వానికి పన్నుల వసూళ్లలో ఆదాయం సమకూర్చాలి. ఇదీ రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల (ఏఎంవీఐ) విధులు. పురుషులతో సమానంగా, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ శ్రమిస్తూ క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్న మహిళా అధికారులకు కష్టాలు తప్పడం లేదు. కనీసం వాహనాలు కూడా సమకూర్చకపోవడంతో ఎలా విధులు నిర్వహించాలన్నది వారి ఆవేదన.
రవాణా శాఖలో మహిళా సాధికారత మాటలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో సవాలుతో కూడిన విధులను నిర్వహించేందుకు ముందుకొచ్చిన మహిళా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురుష అధికారులతో సమానంగా టార్గెట్లు విధిస్తున్న ప్రభుత్వం.. వారికి కనీస సౌకర్యాలైన రహదారి రక్షణ వాహనాలను (పెట్రోలింగ్ లేదా రవాణా వాహనాలు) కేటాయించడంలో మాత్రం విఫలమవుతోంది.
రాష్ట్రంలో రవాణాశాఖలో మహిళా ఏఎంవీఐలు సుమారు 45 మంది, ఎంవీఐలు సుమారు 20 మంది పనిచేస్తున్నారు. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో సుమారు 16 మంది ఏఎంవీఐలు, ఎంవీఐలు 5 మంది, మల్టీ జోన్-2 పరిధిలో సుమారు 29 మంది ఏఎంవీఐలు, 15 మంది ఎంవీఐలు పనిచేస్తున్నారు. విధుల్లో చేరి ఏళ్లు గడుస్తున్నా వాహనాలు రాకపోవడంతో మహిళా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
వినతులిచ్చినా… వినిపించుకోరే…
రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖలో కీలక పోస్టుల్లో మహిళలు బాధ్యతలు చేపట్టారు. వారికి కేటాయించాల్సిన అధికారిక వాహనాలు (జీపులు లేదా కార్లు) ఏళ్ల తరబడి మంజూరు కావడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత వాహనాలను వాడుకోవాల్సి వస్తోందని, లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని మరికొందరు మహిళా అధికారులు వాపోతున్నారు.
ఈ విషయమై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. బడ్జెట్ లేదనో, ఫైల్ పరిశీలనలో ఉందనో కాలయాపన చేస్తున్నారే తప్ప కనీస స్పందన కరువైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వాహనాలు రాకపోయినా.. పన్నుల వసూళ్లు, ఎన్ఫోర్స్మెంట్ టార్గెట్లు (లక్ష్యాలు) మాత్రం సకాలంలో పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోన్నట్లు సమాచారం. చేతిలో సరైన వాహనం లేక, క్షేత్రస్థాయిలోకి సకాలంలో వెళ్లలేక.. టార్గెట్లు ఎలా చేరుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ అర్ధరాత్రి.. ఎలా వెళ్లాలి?
రవాణా శాఖలో తనిఖీలు రాత్రింబవళ్లు జరుగుతుంటాయి. రహదారులపై అక్రమ రవాణా, ఓవర్లోడింగ్, నిబంధనల ఉల్లంఘనలపై అర్ధరాత్రి, తెల్లవారుజామున తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో హైవేలపై తనిఖీలకు వెళ్లాలంటే మహిళా అధికారులకు రక్షణ కరువైంది.
సొంత వాహనాల్లో వెళ్లినా.. అక్రమ రవాణా చేసే ముఠాలు, లారీ డ్రైవర్లు అధికారిక వాహనం కాదనే నెపంతో ఆపకుండా వెళ్లిపోతున్నారు. ఎదురుతిరుగుతున్నారు. “మాకు ప్రభుత్వ వాహనం, దానికి ప్రత్యేక రంగు, సైరన్ ఉంటేనే ఆ రౌడీ మూకలకు భయం ఉంటుంది. కనీసం వాహనం కూడా ఇవ్వకుండా మమ్మల్ని రోడ్లపైకి వెళ్లమంటే ఎలా?” అని ఓ మహిళా ఎంవీఐ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి చొరవ తీసుకుంటేనే..
వాహనాలు లేవని ఉద్యోగులతో పాటు యూనియన్లు సైతం ప్రభుత్వానికి, సంబంధిత శాఖ మంత్రికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినప్పటికీ వాహనాల విషయం పెండింగ్లోనే పడింది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తామని ఉద్యోగులకు చెప్పినట్లు సమాచారం. ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారో లేదో చూడాలి.
