Telangana Metro News | మెట్రో రెండో దశపై కేంద్ర-రాష్ట్రాల వ్యూహాలు

Telangana Metro News | మెట్రో రెండో దశపై కేంద్ర-రాష్ట్రాల వ్యూహాలు
Telangana Metro News | అనుమతుల జాప్యంతో ఆగిపోయిన మెట్రో విస్తరణ
మెట్రో ఆస్తుల విక్రయంపై సర్కార్ దృష్టి
300 ఎకరాల భూములపై ప్రభుత్వ లెక్కలు
గ్రేటర్ ఎన్నికల ముందే ప్రాజెక్టులకు వేగం?
Telangana Metro News | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: మెట్రో స్వాధీనం, మెట్రో రెండో దశపై మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే కాకుండా మెట్రో ఆస్తులు విక్రయించి రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని రేవంత్ సర్కార్ వ్యూహం పన్నుతుండగా, కేంద్రం వీటిని దీటుగా తిప్పికొడుతూ కావాలనే అనుమతుల పేరుతో జాప్యం చేస్తోంది. ఫలితంగా మెట్రో విస్తరణ అంశం ముందుకు కదలడం లేదు.
కేంద్ర అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డి సహా అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. ఏడాది కాలంగా మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ నాలుగు రోజుల్లో రెండు సార్లకుపైగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. సీఎం కూడా ఢిల్లీలోనే ఉండగా దీనిపై కొంత ప్రయత్నం మళ్లీ చేసినట్లు తెలిసింది.
కేంద్రం సూచించినట్లుగా తొలి దశ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్, ఎల్ అండ్ టీ బకాయిల చెల్లింపు జూన్‌లో పూర్తవనున్నట్లు తెలిసింది. ఈ లోగా రెండో దశ విస్తరణపై కేంద్రం నుంచి ఆమోదం పొందే చర్యలను వేగవంతం చేస్తోంది. రెండో దశకు కేబినెట్ ఆమోదంతో 18 నెలల క్రితమే డీపీఆర్‌లు అందించారు. కేంద్రం పలు నగరాలకు అనుమతులిచ్చి, తెలంగాణకు మొండిచేయి చూపింది. దీంతో రెండో దశపై ఆందోళన నెలకొనగా, మొదటి దశ నిర్వహణ కత్తిమీద సాములా మారింది. నష్టాలు, అప్పులు ప్రభుత్వానికి గుదిబండగా మారాయి.

మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చాయి. కానీ కేంద్రం నుంచి అనుమతుల ఆలస్యం ప్రతిష్టంభనకు కారణమవుతోంది. మెట్రో రెండో దశ ప్రారంభంతో పాటు, మూసీ ప్రక్షాళన పనులను ప్రారంభించి గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని భావించిన సర్కారుకు కేంద్రం నిర్ణయాలు శరాఘాతంగా మారాయి.
ఆస్తులు అమ్ముకోవడానికేనా…?
మెట్రో స్వాధీనం చేసుకోగానే దానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూములు, ఆస్తుల వివరాలను లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరో 2-3 నెలల్లో ఆయా భూములు, ఆస్తులను అమ్మకం లేదా దీర్ఘకాలిక లీజుకు కట్టబెట్టాలన్నది సర్కారు వ్యూహంగా తెలుస్తోంది.
69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్న మెట్రో సంస్థకు నగరవ్యాప్తంగా 300 ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది. మెట్రో స్టేషన్లు, పార్కింగ్ యార్డులు, డిపోలకు సమీపంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్న భూములతో రెవెన్యూ వస్తోంది. నగరంలో రెండు భారీ డిపోలతో పాటు, 57 స్టేషన్లను కలిగి ఉన్న మెట్రో వ్యవస్థ నిర్మాణానికి అప్పట్లోనే రూ.18,880 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 70 శాతం రుణాలతో సర్దుబాటు చేయగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ భరించింది.
రాష్ట్ర సర్కార్ వాటాగా ఎల్ అండ్ టీ సంస్థకు ఏకంగా 250 నుంచి 300 ఎకరాల భూమిని కట్టబెట్టింది. ఈ భూమిని డెవలప్ చేయడం ద్వారా మెట్రో నిర్వహణ సంస్థ ఏటా 55 శాతం రెవెన్యూ సృష్టించాలనేది ఒప్పందం. కానీ నిర్వహణ నుంచి ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకోవడంతో భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థకు ఇవ్వాల్సిన నిధుల సర్దుబాటుపై తర్జనభర్జనలు పడుతున్న రాష్ట్ర సర్కార్ మెట్రోకు ఉన్న భూములను ఆర్థిక వనరులుగా మార్చే మార్గాలను అన్వేషిస్తోంది.
మెట్రోకు మియాపూర్ డిపో కోసం 99 ఎకరాలు, ఫలక్‌నుమా (నిర్మాణం కాలేదు) వద్ద 17 ఎకరాలు, నాగోల్ డిపో వద్ద మరో 96 ఎకరాలు కలిపి మొత్తంగా 212 ఎకరాల ఓపెన్ స్థలాలు ఉన్నాయి. ఇందులో 70-80 శాతం మెట్రో అవసరాలకు రెండు మూడు ఫ్లోర్లలో వినియోగించి, మిగిలిన 20 శాతం భూమిని నిర్మాణ సంస్థ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ చేసుకునే వెసులుబాటునిచ్చింది.
వీటితో పాటు 25 మెట్రో స్టేషన్ల సమీపంలో మరో 57 ఎకరాల ఖాళీ జాగాలు ఉండగా, మిగిలిన మరో 30 ఎకరాల విస్తీర్ణంలో మెట్రో స్టేషన్ల పైభాగంలో ల్యాండ్ బ్యాంక్ కలిపి మొత్తంగా మెట్రో సంస్థకు 300 ఎకరాల భూములు ఉన్నాయని గతంలో తేల్చింది. టేకోవర్ తర్వాత ఉన్న భూముల విలువను తాజాగా అంచనా వేసి, లెక్కలు తేలిన వెంటనే ఓపెన్ మార్కెట్లోకి తెచ్చేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
