NEET Exam Leak | లక్షలాది విద్యార్థులపై ఆర్థిక, మానసిక భారం

NEET Exam Leak | లక్షలాది విద్యార్థులపై ఆర్థిక, మానసిక భారం

NEET Exam Leak | ప్రశ్నాపత్రం లీక్‌తో నీట్ పరీక్ష రద్దు
పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం
ఆన్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంపై నిపుణుల సూచనలు
లోపరహిత పరీక్షా విధానం కోసం కఠిన చర్యల అవసరం

NEET Exam Leak | జాతీయ స్థాయిలో ఎంబీబీ‌ఎస్‌తో సహా మరో పది కోర్సుల్లో చేరేందుకు ప్రవేశార్హత నిర్ణయించే నీట్ యూజీ పరీక్ష ఈ సంవత్సరం పరీక్షా పత్రం లీక్ అయిన కారణంగా రద్దు కావడం అభిశంసనీయం. 23 లక్షల మంది విద్యార్థులు రెండున్నర లక్షల సీట్ల కోసం పోటీ పడిన ఈ పరీక్ష ఉన్నఫళంగా రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం వారికీ, వారి కుటుంబాలకూ ఆర్థికంగా, భావోద్వేగ పరంగా ఎంతో భారం.

దేశంలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సులకు ఎంతో డిమాండ్. ఈ పరిస్థితిని సొమ్ముచేసుకునేలా ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి. వారి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాసిన పరీక్ష కూడా రద్దు కావడం చెప్పలేనంత నష్టం.

ఈ పరీక్షను అన్ని రాష్ట్రాలకు ఉమ్మడిగా నిర్వహించే విధానం 2013లో మొదలైంది. తర్వాత 2019లో ఇలా నిర్వహించడానికి గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రభుత్వం స్థాపించింది. ఏ సంవత్సరం కూడా వివాద రహితంగా, పక్కాగా పరీక్షల నిర్వహణ జరగలేదు. 2024లో కూడా పరిమిత సంఖ్యలో పాక్షికంగా రద్దు చేసి, మరలా పరీక్ష జరిపే అవసరం పడింది. కానీ ఇలా పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఇదే మొదటిసారి.

ప్రపంచంలోనే ఒక దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే పెద్ద పరీక్ష నీట్. అందుకు తగ్గట్టుగా లోపరహితంగా వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పూర్తిగా ఆన్‌లైన్ విధానం కానీ, హైబ్రిడ్ విధానం గానీ తీసుకువస్తే కొన్ని లొసుగుల్ని అధిగమించవచ్చని నిపుణులు సలహా ఇచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు లేవు.

లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల ఆర్థిక స్థితి ఒక్క పెట్టున మార్చగలిగే ఒక్క రోజు పరీక్షని సరిగ్గా నిర్వహించలేకపోవడం దేశానికి సిగ్గుచేటు. సామాజిక నేరం. ఇప్పుడు ఈ రద్దుపై దర్యాప్తు జరగనుంది. అయితే బాధ్యులపై కఠిన చర్యలు ఉండాలి. వ్యవస్థలో దిద్దుబాట్లు జరిగి, మేలైన పరీక్షా విధానం, లోపరహిత నిర్వహణ జరిగేలా చర్యలు ఉండాలి.

నీట్ పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపడం గొప్పతనం కాదు. ఒక్క లోపం లేకుండా, ఒక్క అనుమానం రాని విధంగా పరీక్ష పక్కాగా నిర్వహించడం గొప్ప. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలి. నీట్‌ను నీట్‌గా నిర్వహించాలి.. డౌట్‌గా కాదు.

డా. డి.వి.జి. శంకరరావు
మాజీ ఎంపీ, విజయనగరం.
ఫోన్: 9440836931

Leave a Reply