గాలివాన దెబ్బకు చీకట్లు..
గాలివాన దెబ్బకు చీకట్లు..
పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు
భీమవరం బ్యూరో ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా వీచిన ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. గురువారం రాత్రి గాలివాన బీభత్సానికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల రేకుల షెడ్లు, హోర్డింగ్‌లు ఎగిరిపోగా, ఆక్వా చెరువుల వద్ద ఉన్న ఏరియేటర్లు, ఇతర సామగ్రి చెల్లాచెదురయ్యాయి.
ఈదురు గాలుల తీవ్రతకు జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరఫరా పునరుద్ధరణ కోసం విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం శ్రమించారు.
గత రెండు రోజుల్లో వీచిన ఈదురు గాలుల కారణంగా జిల్లాలో 237 విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. 14.7 కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్లు ధ్వంసమయ్యాయి. 17 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.36.30 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని 33 కేవీ ఫీడర్లు 66, 11 కేవీ ఫీడర్లు 415 పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ ప్రత్యేక మరమ్మత్తు బృందాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టింది.
జిల్లాలోని 96 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో 7,55,644 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా కోసం 34,221 ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేస్తున్నాయి.
గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉషారాణి తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా ప్రత్యేక బృందాలతో పనులు చేపట్టామని చెప్పారు.
జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, మిగిలిన ప్రాంతాల్లో కూడా పనులు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు.
