రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

  • బ్లాక్ స్పాట్లపై దృష్టి.. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి
  • జాతీయ రహదారుల అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

ఏలూరు, ఆంధ్రప్రభ: జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి ఆమె ప్రమాదాల నివారణ చర్యలను సమీక్షించారు.

గత ఏడాది జిల్లాలో 304 రోడ్డు ప్రమాదాల్లో 149 మంది మృతిచెందారని, గతంతో పోలిస్తే ప్రమాదాలు తగ్గినప్పటికీ ప్రాణనష్టం ఆందోళనకరమని కలెక్టర్ పేర్కొన్నారు. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. ప్రజల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన కలెక్టర్, కీలక సమావేశానికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరుకాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక పంపి చర్యలు కోరుతానని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ అన్ని పాఠశాల బస్సుల్లో డాష్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారులపై అతివేగంతో వెళ్లే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రహదారులపై వాహనాల నిలుపుదలను నిరోధించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అధిక కాంతి వెదజల్లే లైట్లు అమర్చిన వాహనాలు, వాటిని విక్రయించే దుకాణాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, రవాణా శాఖ ఉప కమిషనర్ కరీం, ఆర్టీవో ఎస్.బి. శేఖర్, డీపీవో మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.