West Godavari Development | ఆగస్టు 15న సంజీవిని పథకం
West Godavari Development | ఆగస్టు 15న సంజీవిని పథకం
West Godavari Development | పేదల ఆరోగ్యం కోసం రూ.25 లక్షల భరోసా
West Godavari Development | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం, రైతుల ఆస్తి హక్కులను శాశ్వతంగా పరిరక్షించడం, భూ వివాదాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా మీ భూమి – మీ హక్కు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పచ్చదనంతో అలరారే ఉమ్మడి పశ్చిమగోదావరి- తూర్పుగోదావరి జిల్లాలు దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారాయన్నారు. భూమిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పంటలు పండించే రైతులు, ఈ ప్రాంత ప్రజలు చాలా సహృదయులన్నారు. వివాదాలు లేని ఈ ప్రాంతంలో గత పాలకులు రికార్డులు తారుమారు చేసి చిచ్చు పెట్టి భూవివాదాలు సృష్టించారన్నారు. ఈ ప్రాంతంలో బ్రిటిషర్లు నిర్వహించిన రికార్డుల కారణంగా ఏపీలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉండేవి కాని దుర్మార్గమైన గత పాలకుల నిర్వాకం కారణంగా అంతా గందరగోళంగా మారింది. ప్రజల భూముల విషయంలో సమస్యలు సృష్టించారన్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశాం
మన భూమి యాజమాన్య హక్కుల్ని హరించేందుకు జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్టును తీసుకొచ్చిందన్నారు. దుర్మార్గమైన ఈ యాక్టు ను రద్దు చేసేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చమన్నారు. రైతుల భూముల యాజమాన్య హక్కులను రక్షించమన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన భూమి రికార్డులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేశారన్నారు. భూమి మీదైతే ఫోటోలు వారివి ముద్రించుకున్నారన్నారు. పొలం సరిహద్దు రాళ్లపై కూడా బొమ్మలు ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ జగన్ భూతం తరహాలో రైతుల వెంటపడి రూ.800 కోట్లు పెట్టి గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్నారన్నారు.
పేదల ఆరోగ్యం కోసం సంజీవని..
పేదల ఆరోగ్యం కోసం సంజీవని పథకాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ
పట్టాదారులు పాస్ పుస్తకాల్లో సమస్యల పరిష్కారానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సహా క్యూఆర్ కోడ్ లాంటి పటిష్టమైన చర్యలతో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం అన్నారు. రీ సర్వే చేయటంతో పాటు రైతుల్ని భాగస్వాములను చేసి వివరాలను తనిఖీ చేసి, ఈకేవైసీ చేశాక పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రిస్తున్నా మన్నారు. కరెన్సీ నోట్లకు ఎన్ని భద్రతా ఫీచర్లు ఉంటాయో అదే తరహాలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం అన్నారు. 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూమి రికార్డులను అప్డేట్ చేశాం అన్నారు. 26.46 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసామన్నారు. మరో 62.32లక్షల పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని, నిర్దేశిత గడువులోగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తామని తెలిపారు. గ్రామాల్లో సర్వీసు ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫ్రీ హోల్డ్‌లో ఉంచాం. 22ఏ కింద ఈ భూములను పరిష్కరించి హక్కుదారులకు అప్పగిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలో ఏళ్లుగా వివాదాల్లో ఉన్న శెట్టిపల్లి గ్రామ భూముల్ని పరిష్కరించి వారికి అప్పగించామన్నారు.
ప్రతీ నెలా వచ్చి నేరుగా భూ యజమానుల్ని, రైతులను కలిసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం తెలిపారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గాన్ని పరిష్కరిస్తూ, భూ రికార్డులను ప్రక్షాళన చేసేందుకు 3 ఏళ్ల సమయం పట్టిందని తెలిపారు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామన్నారు . రీ-సర్వే 2.0 కింద ఇప్పటికే 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామన్నారు . అమ్మకం, బహుమతి, విభజన వంటి 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటో మ్యుటేషన్ తెచ్చామని తెలిపారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనామ్ భూములను 22ఏ నుంచి తప్పించామన్నారు . 15 జిల్లాల్లోని 33,012 ఎకరాల షరతు గల పట్టా భూములపై ఉన్న ఆంక్షలను కూడా తొలిగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్లు జమ చేశాం. కేంద్రంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నామన్నారు.
చెరువుల మరమ్మతుకు చర్యలు..
గోదావరి డెల్టా ప్రాంతంలో కాలువలు, చెరువుల మరమ్మతులు, నిర్వహణ సమర్ధవంతంగా చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో మీరు ధాన్యం అమ్ముకోవడానికి కూడా రైతులు ఇబ్బందులు పడ్డారని , నేడు ఆ పరిస్థితి లేదన్నారు. నేడు 24 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో పాటు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆక్వా జోన్ పరిధిలోని చెరువులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దాణా రేట్లు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకే రాయితీలు ఇవ్వాలని, సోయాబీన్ మీల్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన నడుస్తోంది. సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాల నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు . జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పులు పెట్టారన్నారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు.
