22న జిల్లా క్రికెట్ క్రీడాకారుల ఎంపిక

22న జిల్లా క్రికెట్ క్రీడాకారుల ఎంపిక

  • ఎంపికైన క్రీడాకారులకు ఉచిత క్రీడా శిక్షణ
  • జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి వెంకట్ రెడ్డి

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లా క్రికెటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో 2026–27 క్రికెట్ సీజన్‌కు సంబంధించి ఈనెల 22న 16 సంవత్సరాల లోపు, 19 సంవత్సరాల లోపు బాలుర, సీనియర్ మహిళల ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెటర్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి విభాగం నుంచి 25 ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి నగరంలోని గిరిరాజ్ కళాశాలలోని మైదానంలో గల నెట్స్ లో మూడు నెలల పాటు అన్ని సౌకర్యాలతో కూడిన ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిబిరంలో క్రీడాకారుల ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా తుది 15 మంది సభ్యులతో జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

16 సంవత్సరాల లోపు విభాగానికి 01/09/2010 నాడు, తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులు కాగా, 19 సంవత్సరాల లోపు విభాగానికి 01/09/2007 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. సీనియర్ మహిళల విభాగంలో 14 సంవత్సరాలు పూర్తి చేసి, 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు పాల్గొనవచ్చని వెల్లడించారు. ఈ ఎంపికలు ఉదయం 7 గంటలకు బాలుర విభాగాలకు, మధ్యాహ్నం 4 గంటలకు మహిళల విభాగానికి నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఎంపికలకు హాజరయ్యే ప్రతి క్రీడాకారుడు తమ స్వంత క్రికెట్ సామగ్రిని తీసుకురావాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మెమోతో పాటు వాటి జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నారు. తెలుపు రంగు క్రికెట్ దుస్తులు, బూట్లు ధరించడం తప్పనిసరి అని తెలిపారు. ఎంపికల సమయంలో తల్లిదండ్రులు, శిక్షకులకు మైదానంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ఈ ఎంపికలను కార్యదర్శి ఎం. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రావు, సంయుక్త కార్యదర్శి, శిక్షకుడు ఎ. సురేష్ బాబు పర్యవేక్షించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాలకు శిక్షకులు లలిత్ (94949 59059), నయీమ్ (81060 60600)లను సంప్రదించాలని సూచించారు.