HYD | మహనీయుల స్ఫూర్తితో భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి…
- శ్రీగణేష్ ఫౌండేషన్ అధినేత ముకుల్
కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి, బ్రిటిష్ పాలన నుంచి విముక్తుల్ని చేసిన భారత మహనీయుల స్ఫూర్తిని నేటి బాలలు అలవర్చుకుని, భవిష్యత్తుకు బాటలు వేసుకొని మంచి భారత పౌరులుగా తయారుకావాలని గణేష్ ఫౌండేషన్ అధినేత ఎన్. ముకుల్ సూచించారు.
ఈ నేపథ్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ జయంతి ఉత్సవాల్లో భాగంగా, శనివారం 3వ వార్డు పరిధిలోని కార్ఖానా గన్ రాక్ స్కూల్‌లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో ముకుల్ ముఖ్య అతిథిగా పాల్గొని, వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ముకుల్ మాట్లాడుతూ.. మహనీయుల స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశభక్తిని అలవర్చుకుని, భవిష్యత్తుకు బాటలు వేసుకుని దేశానికి ఉపయోగకరంగా తయారుకావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దిశగా నేటి బాలలకు పాఠశాలలలోనే ప్రాథమిక దశ నుంచే సరైన అవగాహన కల్పించాలని సూచించారు.
