పిడుగు పడి తాటి చెట్లకు మంటలు..

పిడుగు పడి తాటి చెట్లకు మంటలు..

అప్రమత్తమైన గ్రామస్తులతో తప్పిన ప్రమాదం

నెన్నెల, ఆంధ్ర‌ప్ర‌భ : మండలంలోని కొత్తూరు గ్రామం ఒకటవ వార్డులో సాయంత్రం పిడుగు పడి రెండు తాటి చెట్లకు మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఏనుక పోశం ఇంటి సమీపంలో ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఆ మంటలు పక్కనే ఉన్న మరో తాటి చెట్టుకు వ్యాపించడంతో భారీ అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కొంతసేపు అగ్నిజ్వాలలు తీవ్రంగా వ్యాపించడంతో సమీప ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

కాగా గ్రామస్తుల సమయస్ఫూర్తికి తోడు స్వల్ప వర్షం కురవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం, మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకపోవడం గ్రామస్తులకు ఉపశమనాన్ని కలిగించింది. గ్రామస్తుల అప్రమత్తత వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.

Leave a Reply