కోచింగ్ సెంటర్ బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థి..
- తండ్రితో ఇంటికి తీసుకెళ్లాలంటూ మారం…
- మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం…
- తీవ్ర గాయాలతో కర్నూలుకు తరలింపు..
- కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక గురు నవోదయ కోచింగ్ సెంటర్లో నవోదయ ప్రవేశ పరీక్షకు శిక్షణ పొందుతున్న 12 ఏళ్ల విద్యార్థి నిశాంత్ కోచింగ్ సెంటర్ భవనం మూడో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన నిశాంత్ కొంతకాలంగా ఎమ్మిగనూరులోని గురు నవోదయ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. ఆదివారం కుమారుడిని చూసేందుకు తండ్రి సుధాకర్ కోచింగ్ సెంటర్కు వచ్చారు. ఈ సందర్భంగా తాను అక్కడ ఉండలేనని, తనను ఇంటికి తీసుకెళ్లాలని నిశాంత్ తండ్రిని కోరాడు. అయితే చదువుపై దృష్టి పెట్టాలని సూచించిన తండ్రి, ప్రస్తుతం ఇంటికి తీసుకెళ్లడం సాధ్యం కాదని మందలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిశాంత్ క్షణికావేశంలో కోచింగ్ సెంటర్ మూడో అంతస్తు పై నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, స్థానికులు వెంటనే ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఆసుపత్రికి రెఫర్ చేశారు.
ఈ ఘటనతో కోచింగ్ సెంటర్లో ఉన్న విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా, ఘటనకు నిరసనగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కోచింగ్ సెంటర్ ఎదుట ఆందోళన చేపట్టారు. కోచింగ్ సెంటర్లో విద్యార్థుల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, పర్యవేక్షణపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

