బీసీ వర్గానికి న్యాయం కోరితే సస్పెన్షనా..

బీసీ వర్గానికి న్యాయం కోరితే సస్పెన్షనా..

  • పెరుమాండ్ల చరణ్ గౌడ్

కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ఎస్యూఐ అండ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై ఇండియన్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి షోకాజ్ నోటీసు లేకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నేను 2011 నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశాను. ఎన్ఎస్యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాను. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపై హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్నాను, కేసులు ఎదుర్కొన్నాను, కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోలేదు.

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంపై నేను చేసిన నిరసన పూర్తిగా శాంతియుతం, ప్రజాస్వామ్యబద్ధమైనది. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ ఎన్ఎస్యూఐ అండ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశాను. కానీ దానికి ప్రతిఫలంగా నాపై సస్పెన్షన్ విధించడం బీసీ సమాజాన్ని అణచివేయడమే.

ఈ ఘటన ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదు…
బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని చెప్పే నాయకత్వం వాస్తవానికి బీసీ యువత గొంతును ఎంతవరకు అణచివేస్తుందో చూపించే ఉదాహరణ అని ఈసందర్భంగా చరణ్ గౌడ్ పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని, బీసీ సమాజానికి న్యాయం చేయడంతో పాటు నా పై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.బీసీలకు న్యాయం జరిగే వరకు, కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడే కార్యకర్తలకు గౌరవం దక్కే వరకు నా పోరాటం కొనసాగుతుందనీ పేర్కొన్నారు.