ఇంద్రకీలాద్రిపై హనుమజ్జయంతి వైభవం

ఇంద్రకీలాద్రిపై హనుమజ్జయంతి వైభవం

-మే 12న ప్రత్యేక పూజలు, అభిషేకాలు
-మూడు ఆంజనేయస్వామి ఆలయాల్లో శాస్త్రోక్త సేవలు
-భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఆహ్వానం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 12న హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వైదిక కమిటీ సూచనల మేరకు మంగళవారం జరిగే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో విశేష పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దేవస్థానం వెల్లడించింది.

ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఘాట్ రోడ్డులోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయం, అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, మెట్ల మార్గంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మూడు ఆలయాల్లో స్వామివారికి పవిత్ర అభిషేకాలు, తమలపాకులతో నాగవల్లి దళార్చన (ఆకుపూజ) శాస్త్రోక్తంగా జరగనున్నాయి.

ఆలయాలను రంగురంగుల పుష్పాలు, ప్రత్యేక పూలదండలతో సుందరంగా అలంకరించేందుకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply