అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలి

  • ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
  • ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ అడ్డూరి అనిల్ మాదిగ

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ అడ్డూరి అనిల్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను పరిశీలించి తెలంగాణలోనూ పేదలకు ప్రయోజనం చేకూరేలా సమగ్ర నిర్ణయం తీసుకోవాలని కోరారు.

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 40 ఏళ్ల క్రితం భూమిలేని నిరుపేదల జీవనోపాధి కోసం ప్రభుత్వం అసైన్డ్ భూములను కేటాయించిందన్నారు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, గిరిజన కుటుంబాలకు ఈ భూములు జీవనాధారంగా మారాయని పేర్కొన్నారు.

అయితే అసైన్డ్ భూములపై ఉన్న చట్టపరమైన పరిమితుల కారణంగా పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు భూములను విక్రయించలేకపోవడంతో పాటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఆస్తి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమైనప్పటికీ పూర్తి హక్కులు లేకపోవడంతో ఆ భూములను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

వరంగల్ డిక్లరేషన్ హామీ అమలు చేయాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వరంగల్ డిక్లరేషన్ సభలో అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని అనిల్ మాదిగ గుర్తుచేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీని అమలు చేసి అసైన్డ్ భూముల పట్టాదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు.

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రభుత్వం కేటాయించిన భూముల విషయంలో పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనుసరించిన విధానాలు, జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలని సూచించారు. పేదల జీవనోపాధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయమే లక్ష్యంగా అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అడ్డూరి అనిల్ మాదిగ విజ్ఞప్తి చేశారు.