నిర్ణీత గడువులోగా దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలి.

  • తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే

దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే సూచించారు.

శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని స్పష్టం చేశారు.

భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణను వేగవంతం చేసి నివేదికలను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. అలాగే కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులను నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు.

బీఎల్‌ఓలకు అవసరమైన సాంకేతిక సహకారం, మార్గనిర్దేశం అందించాలని, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించడమే అధికారుల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.