VivaTech-2026 | ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు..
ఆంధ్రప్రభ : సాంకేతికతలో ఆవిష్కరణలతో పాటు అందరికీ అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్‌లోని వివాటెక్-2026 సదస్సులో ప్రసంగించిన మోదీ.. సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సాంకేతికత అందరి జీవితాలను మెరుగుపరచాలని, అందుబాటును విస్తరించాలని, ఆర్థిక వృద్ధికి దోహదపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సహకరించాలని మోదీ చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) విషయంలో భారత్ ఇదే దృక్పథాన్ని అనుసరిస్తోందని తెలిపారు.
వివాటెక్-2026లో భారత్‌కు ‘ఏఐ కంట్రీ పార్ట్‌నర్’ హోదా లభించడం కూడా ఈ ఆలోచనకు ప్రతిబింబమని పేర్కొన్నారు. “భారత్ దృష్టిలో ఏఐ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అది ‘ఆల్ ఇన్‌క్లూజివ్’” అని మోదీ స్పష్టం చేశారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిభా నిలయంగా ఎదిగిందని, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు నియంత్రణలను సరళీకరిస్తున్నామని తెలిపారు. వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతూ, ఆవిష్కరణల నుంచి వాణిజ్యీకరణ వరకు ప్రైవేటు రంగానికి 50 బిలియన్ డాలర్లకు పైగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు.
అత్యంత చౌకైన డేటా సేవలు, తక్కువ వ్యయంతో లభించే హరిత ఇంధనం కూడా భారత్ ప్రత్యేకతలని పేర్కొన్నారు. ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తుందని, పరిశ్రమలు ఆవిష్కరణలకు దారితీస్తాయని, స్టార్టప్‌లు మార్పుకు నాంది పలుకుతాయని, అంతర్జాతీయ భాగస్వాములు వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారని మోదీ అన్నారు.
“భారత్‌తో కలిసి పనిచేయండి.. అందరికీ ప్రయోజనం చేకూరే భవిష్యత్తును నిర్మిద్దాం” అంటూ ప్రపంచ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు ప్రధాని పిలుపునిచ్చారు.
