రెండు రోజుల పసుపు పండుగ విజయవంతం

రెండు రోజుల పసుపు పండుగ విజయవంతం
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ పార్లమెంట్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం ఘనంగా ముగిసింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 32 క్లస్టర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటించి పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి వన్ సెంటర్‌లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమాల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు ప్రాంతాల్లో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల కోసం ఏర్పాటైందని అన్నారు. మహానాడు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరిగిందని, ఎక్కడ చూసినా పసుపు కండువాలతో ప్రాంతాలన్నీ కళకళలాడాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కార్యకర్తల అండతో ముందుకు సాగిందని అన్నారు.
నందిగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నియోజకవర్గ పరిశీలకులు, క్లస్టర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ చిన్ని వర్చువల్ మహానాడులో పాల్గొన్నారు. కోటి సభ్యత్వాలు కలిగిన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం కల్పిస్తుందని తెలిపారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, గరుడాచలం ప్రాంతాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమాల్లో కూడా ఎంపీ పాల్గొన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మహానాడు వైభవంగా జరగడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పాల్గొనడాన్ని అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన వైపు అడుగులు వేస్తోందని, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం వేగంగా సాగుతోందని ఎంపీ చిన్ని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కేడర్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, నాయకులు ఎంతమంది వచ్చినా పార్టీకి శాశ్వత బలం కార్యకర్తలేనని స్పష్టం చేశారు.
తిరువూరు నియోజకవర్గంలోని ఊటుకూరు, తోటమూల, గంపలగూడెం, తిరువూరు టౌన్, గోపాలపురం ప్రాంతాల్లో నిర్వహించిన మహానాడు కార్యక్రమాల్లో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గం తనకు ప్రత్యేకమని, తన రాజకీయ ప్రచారం మొదటగా తిరువూరు ప్రాంతం నుంచే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు.
తన విజయంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల పాత్ర మరువలేనిదని ఎంపీ చిన్ని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే విజయాల కోసం తిరువూరు కేడర్ పనిచేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు.
రెండు రోజుల పసుపు పండుగను విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ బాధ్యులు, తెలుగు తమ్ముళ్లకు ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక అభినందనలు తెలిపారు.

