బాపట్లలో చౌకధర దుకాణంలో అదనపు బియ్యం నిల్వలు.. కేసు నమోదు
పాడిసెపేట రేషన్ షాపులో ఆకస్మిక తనిఖీ..
3 క్వింటాళ్ల అదనపు బియ్యం గుర్తింపు
బాపట్ల, (ఆంధ్రప్రభ): బాపట్ల పట్టణంలోని పాడిసెపేట ప్రాంతంలో రాజీవ్ మహిళా పొదుపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌకధర దుకాణం నెం. 0789027లో అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో అదనపు బియ్యం నిల్వలు గుర్తించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జగన్ మోహన్ రావు, సీఎస్‌డీటీ ఫణికుమార్ ఆదివారం దుకాణాన్ని తనిఖీ చేయగా, రికార్డుల్లో ఉండాల్సిన నిల్వలకు అదనంగా సుమారు మూడు క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు తేలింది.
ఈ నేపథ్యంలో దుకాణ నిర్వాహకురాలు కే. రూతమ్మపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
