ఘనంగా శ్రీమన్నారాయణ మహా యజ్ఞ ఉత్సవాలు..

ఘనంగా శ్రీమన్నారాయణ మహా యజ్ఞ ఉత్సవాలు..
అభినవ మేల్కోటలో ఆధ్యాత్మిక శోభ..
కోడూరు – ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఉల్లిపాలెంలో అభినవ మేల్కోటగా పేరు గాంచిన శ్రీగోదా రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ రాజగోపుర కుంభ ప్రోక్షణ, మహాయజ్ఞ ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేసి 108 హోమ గుండాలతో అగ్ని ప్రతిష్ట హోమం, కోటి అష్టాక్షరి మంత్ర హవనాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ధ్వజారోహణం గావించారు.
ఈ మహాయజ్ఞ కార్యక్రమాలకు ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులు శ్రీ త్రిదండి అష్టక్షరీ జీయర్ స్వామిజీకి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు తమ కుటుంబం తరపున లక్ష రూపాయల విరాళం అందించారు.

ఆలయ చైర్మన్ బూరగడ్డ హరినాథ్ బాబు, వైస్ చైర్మన్ మద్దాళి ప్రసాద్, సెక్రటరీ జూపూడి సుభా చంద్రబోస్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్ఐ చాణక్య తమ సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



