రైస్ మిల్లులో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో అక్రమాలను గుర్తించేందుకు విజిలెన్స్ అధికారులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారులోని ఓ రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి బస్వారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మిల్లులో ఉన్న సీఎంఆర్ ధాన్యం నిల్వలను పరిశీలించారు. పౌరసరఫరాల శాఖ నుంచి మిల్లుకు కేటాయించిన ధాన్యం, దానిని బియ్యంగా మార్చి తిరిగి శాఖకు ఎంత మేరకు అప్పగించారనే అంశాలపై అధికారులు లెక్కలు పరిశీలించారు.

ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయనే అనుమానాల నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ సీతారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు అనిల్, ప్రశాంత్, వరుణ్, డిప్యూటీ తహసీల్దార్ దినేష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.